- వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్,వెలుగు : ఔటర్ పరిధిలోని గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటి సరఫరా చేసేందుకు వాటర్‌బోర్డు చేపట్టిన ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్ –- 2 లోని ప్యాకేజీ 2 లో భాగంగా మల్లంపేట (3 ఎంఎల్ సామర్థ్యం) రిజర్వాయర్ ను శుక్రవారం ఎంపీ సుదర్శన్ రెడ్డి సందర్శించారు. అనంతరం బాచుపల్లి ఫిల్లింగ్ స్టేషన్ ను పరిశీలించి ట్యాంకర్ల వివరాలు తెలుసుకుని, రికార్డులు తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్యాకేజీలో నిర్మిస్తున్న 38 రిజర్వాయర్లలో ఇప్పటికే 13 పూర్తయి అందుబాటులోకి వచ్చాయన్నారు.
మిగిలిన 25 నిర్మాణ పనులు 90 శాతం పూర్తయినట్లు తెలిపారు. వాటిని త్వరగా పూర్తి చేసి జూన్ లోపు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. కొత్తగా 1,250 కిలో మీటర్ల మేర కొత్త పైపు లైన్ వేస్తున్నామని, దాదాపు పూర్తి కావచ్చినట్లు పేర్కొన్నారు. ఇన్ లెట్, అవుట్ లెట్ పనులు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రిజర్వాయర్ల ప్రాంగణాల్లో ఆహ్లాదకరమైన వాతావరణానికి బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని సూచించారు. అనంతరం రిజర్వాయర్ల వద్ద నిర్మించిన పంప్ రూమ్ ను పరిశీలించారు.
