హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయ హుండీ లెక్కింపులో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించుకున్న కానుకల మధ్య నకిలీ నోట్లు ప్రత్యక్షం కావడం అధికారులను విస్మయానికి గురిచేసింది. లెక్కింపు సమయంలో అసలు నోట్ల మధ్య రూ.100, రూ.200, రూ.500 విలువ చేసే చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లు బయటపడ్డాయి.
చిన్నారులు ఆడుకునే ఈ డూప్లికేట్ నోట్లను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా హుండీలో వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కులు తీర్చుకునే పవిత్ర స్థలంలో ఇలాంటి వెకిలి చేష్టలకు పాల్పడటం దేవాలయ పవిత్రతను కించపరచడమేనని మండిపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీసీ టీవీ నిఘా పెంచుతామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.
