మా సమస్యలను వెంటనే పరిష్కరించండి : ఔట్ సోర్సింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల డిమాండ్

మా సమస్యలను వెంటనే పరిష్కరించండి : ఔట్ సోర్సింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల డిమాండ్

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు హైదరాబాద్ నాంపల్లిలోని విద్యాభవన్ ముందు ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 134 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 341 మంది వివిధ పోస్టులలో గత 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవా నాయక్ తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమతో వెట్టిచాకిరి చేయించుకుంటూ.. చాలీచాలని జీతాలను ఏజెన్సీల ద్వారా చెల్లిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు దేవా నాయక్. జీతాలు కూడా ఆరు నెలలకు ఒకసారి ఇస్తున్నారని, ఈఎస్ఐ, ఈపీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించకుండా ఏజెన్సీలు తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆరోపించారు. ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు.