సమ్మె బాట పట్టిన గాంధీ ఔట్ సోర్సింగ్ నర్సులు

సమ్మె బాట పట్టిన గాంధీ ఔట్ సోర్సింగ్ నర్సులు

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గాంధీ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ నర్సులు ఆదివారం మెయిన్​బిల్డింగ్ ఎదుట ధర్నా నిర్వహించారు.  తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు డ్యూటీలను బహిష్కరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.  గాంధీ ఆసుపత్రి వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ..  తాము 16  ఏండ్ల నుంచి గాంధీలో ఔట్ సోర్సింగ్ నర్సులుగా విధులు నిర్వర్తిస్తున్నామని,  కొవిడ్ సమయంలో ప్రాణాలను తెగించి పేషంట్లకు సేవలందించామన్నారు. 

కరోనా సమయంలో ప్రత్యేక అలవెన్సు ఇస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదని వాపోయారు. మూడు నెలలకు ఒకసారి జీతాలిస్తున్నారని, తాజాగా తమ జీతాలను రూ.32 వేల నుంచి రూ. 25 వేలకు తగ్గిస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి జీవో జారీ చేస్తూ తమ జీవితాలను అస్తవ్యస్తం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.   రెగ్యులర్​ నర్సులకు  నైట్​డ్యూటీలు వేయకుండా,  తమకే  2  నెలలుగా రాత్రి డ్యూటీలు వేస్తున్నారని వాపోయారు.   వెంటనే ప్రభుత్వం స్పందించి, తమ జీతాలను పెంచాలని, రెగ్యులరైజ్​చేయాలని, నైట్​డ్యూటీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.  లేని పక్షంలో నిరవధికంగా సమ్మె చేస్తామని హెచ్చరించారు.