దేశంలో బీఏ స్టూడెంట్లు కోటిపైనే

దేశంలో బీఏ స్టూడెంట్లు కోటిపైనే
  • బీఎస్సీలో 49 లక్షలు, బీకాంలో 43 లక్షల మంది అడ్మిషన్  
  • కేంద్రం విడుదల చేసిన 2020–21 రిపోర్టులో వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: దేశంలో బ్యాచ్ లర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) కోర్సుకు మస్తు డిమాండ్ ఉంది. ఎక్కువ మంది స్టూడెంట్లు ఇందులోనే చేరుతున్నారు. బీఏలో ఏకంగా కోటి మందికి పైగా స్టూడెంట్లు చేరితే, మిగతా కోర్సుల్లో అందులో సగం మంది కూడా చేరలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2020–21 రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. ఆ ఏడాది బీఏలో 1.04 కోట్ల మంది స్టూడెంట్లు చేరగా.. వారిలో అమ్మాయిలు 52.07%, అబ్బాయిలు 47.3% మంది ఉన్నారు. బీఎస్సీలో 49.12 లక్షల మంది చేరగా.. వారిలో 52.2 % మంది అమ్మాయిలు ఉన్నారు. బీకాంలో 43.22 లక్షల మంది, బీటెక్ ఇంజినీరింగ్ లో 23.20 లక్షల మంది, బీఈలో 13.42 లక్షల మంది చేరారు. కాగా, 2020–21లో బీఏ రెగ్యులర్ ఎడ్యుకేషన్​లో చేరినోళ్లు 85.35 లక్షల మంది ఉండగా... 2018–19లో 76 లక్షల మంది, 2019–20లో 77.64 లక్షల మంది ఉన్నారు. 

పీజీలోనూ.. 

పీజీలోనూ సోషల్ సైన్స్ కోర్సుల్లోనే ఎక్కువ మంది స్టూడెంట్లు చేరారు. సోషల్ సైన్స్​ లో 9.41 లక్షల మంది చదువుతుండగా, మేనేజ్మెంట్ కోర్సుల్లో 6.86 లక్షల మంది, సైన్స్ కోర్సుల్లో 6.79 లక్షలు, కామర్స్ లో 5.36 లక్షల మంది, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 1.77 లక్షల మంది చదువుతున్నారు. ఇంజినీరింగ్​లో దేశవ్యాప్తంగా కంప్యూటర్ కోర్సులదే హవా కొనసాగుతోంది. కంప్యూటర్ ఇంజినీరింగ్ లో 10.81 లక్షల మంది చదువుతుండగా, మెకానికల్ ఇంజినీరింగ్​లో 5.95 లక్షల మంది, సివిల్​లో 4.74 లక్షల మంది చదువుతున్నారు. అయితే అగ్రికల్చర్ ఇంజినీరింగ్​లో కేవలం 22,171 మంది మాత్రమే చేరారు. 

ఫారిన్ స్టూడెంట్లు 48 వేల మంది.. 

దేశంలో 163 దేశాలకు చెందిన స్టూడెంట్లు వివిధ కోర్సుల్లో చదువుతున్నారు. 2020–21లో మొత్తం 48,035 మంది చేరారు. వీరిలో యూజీ కోర్సుల్లో 79.5% మంది, పీజీలో 16.2% మంది, డిప్లొమా కోర్సుల్లో 3.21%  మంది ఉన్నారు. అత్యధికంగా కర్నాటకలో 8,137 మంది, పంజాబ్​లో 6,557, మహారాష్ట్రలో 4,912, ఉత్తరప్రదేశ్ లో 4,654 మంది, తెలంగాణలో 3,445 మంది చదువుతున్నారు. దేశంలో అత్యధికంగా 28.25% మంది నేపాల్​కు చెందినోళ్లు ఉండగా.. ఆ తర్వాత అఫ్గనిస్తాన్ (8.4%), బంగ్లాదేశ్​ (5.7%), అమెరికా (5.1%)కు చెందినోళ్లు ఉన్నారు. 

హైదరాబాద్​లో 488 కాలేజీలు

దేశంలో అత్యధికంగా కాలేజీలున్న టాప్​జిల్లాల లిస్టులో తెలంగాణ నుంచి రెండు జిల్లాలు ఉన్నాయి. బెంగళూర్​అర్బన్​జిల్లాలో 1,058 ఉండగా, జైపూర్ జిల్లాలో 671 ఉన్నాయి. ఆ తర్వాత మూడో స్థానంలో హైదరాబాద్​ జిల్లాలో 488 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా 345 కాలేజీలతో ఆరో స్థానంలో ఉంది. దేశంలో 500లకుపైగా కాలేజీలున్నది కేవలం రెండు జిల్లాల్లోనే. అయితే టాప్ టెన్​లో ఏపీ నుంచి ఒక్క జిల్లా కూడా లేదు.