- అటెండ్ కానున్న 1.06 లక్షల మంది
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్- ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్2026 పరీక్షకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. మొత్తం 1,06,439 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వీరి కోసం అధికారులు 293 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అప్లై చేసిన వారిలో 56,494 మంది బాలురు, 49,945 మంది బాలికలు ఉన్నారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను సెంటర్లలోకి అనుమతించబోమని ఎస్బీటెట్ చైర్మన్ శ్రీదేవసేన తెలిపారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్ మీద ఫొటో ప్రింట్ రాని అభ్యర్థులు తమ వెంట ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో పాటు ఆధార్ కార్డు వంటి ఏదైనా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ వెంట తెచ్చుకోవాలని స్పష్టం చేశారు.
