హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మధిర, వైరా, గోదావరిఖని, భూపాలపల్లి పట్టణాల్లో నిర్వహించిన నాలుగు జాబ్ మేళాల్లో 11 వేల మందికిపైగా నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. ఈ క్రమంలో శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో, ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మెగా జాబ్ మేళాలు జరగనున్నాయి.
ఈ కార్యక్రమాల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సమీప గ్రామాల్లో పోస్టర్లు, మైక్ ప్రకటనలు, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాల్గొనే నిరుద్యోగుల కోసం క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు సౌకర్యం కల్పించారు, ఇప్పటికే వేలాది మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని 200కు పైగా ప్రైవేట్ కంపెనీలను సంప్రదించి, వారి హ్యూమన్ రిసోర్స్ అవసరాలను తెలుసుకొని జాబ్ మేళాలకు ఆహ్వానిస్తున్నారు.
నిరుద్యోగులకు వరం
సింగరేణి మెగా జాబ్మేళా నిరుద్యోగులకు వరంగా మారింది. సామాజిక బాధ్యతలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సింగరేణి ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ జాబ్ మేళాలు కొనసాగుతాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కార్యక్రమాల నిర్వహణలో చురుగ్గా పాల్గొంటున్నారు. – బలరాం, సింగరేణి సీఎండీ
