నేతల ఆర్మీల ఓవర్ యాక్షన్

నేతల ఆర్మీల ఓవర్ యాక్షన్

విమర్శించినా, ప్రశ్నించినా.. సోషల్ మీడియా వేదికగా బూతుపురాణం

లీడర్లు , ప్రజాప్రతినిధుల పేరిట ప్రైవేట్ సేనలు

‘కేసీఆర్ ఆర్మీ’ పేరిట గవర్నర్ తమిళిసైపైనా చిల్లర పోస్టులు

బర్త్​డే వేడుకల పేరిట కర్రలు, కత్తులతో హల్ చల్

సెటిల్మెంట్లు , దందాలు, కబ్జాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారనే ఆరోపణలు

ఫిర్యాదులు వస్తున్నా చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్న లీడర్లు

(వెలుగు, నెట్​వర్క్) :

‘కేసీఆ ర్ ఆర్మీ’.. ‘చిన్నయ్య ఆర్మీ’.. ‘సుమన్ యువసేన ’.. ‘రవన్న సైన్యం ’.. అధికార పార్టీ లీడర్ల పేర్లతో చెలామణి అవుతున్న ప్రైవేట్ గ్రూపులివి. ఇవే కాదు.. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర లీడర్ల పేర్లతో ఎన్నో ఆర్మీలు ఉన్నాయి. అభిమానమో, సొంత ప్రయోజనాలో, లీడర్లే ప్రోత్సహిస్తున్నారో గాని ప్రతి ప్రజాప్రతినిధికో సేన తయారవుతోంది. తమ పార్టీ ఫార్మేషన్ డే అనో, తమ లీడర్ బర్త్​డే అనో ఈ సేనలు హల్ చల్ చేస్తున్నాయి. రానురాను వీటి ఆగడాలు శ్రుతి మించుతున్నాయి. తమ పార్టీని లేదా లీడర్ ని విమర్శిస్తే సోషల్ మీడియా వేదికగా తిట్లు, బెదిరింపులతో విరుచుకుపడుతున్నారు. మరోవైపు సెటిల్మెంట్లు, భూకబ్జాలు, ఇతర దందాల్లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీళ్ల ఆగడాలపై పోలీసులు, ఆఫీసర్లకు ఫిర్యాదులు వస్తున్నా చర్యలు తీసుకోకుం డా లీడర్లు అడ్డుకుంటున్నారనే విమర్శలున్నాయి.

సోషల్ మీడియాలో 24X7

సీఎం, ఎమ్మెల్యే లు, మంత్రుల పేర్లను తగిలిం చుకున్న ప్రైవేట్ సేనల్లోని లీడర్ల అనుచరులు సోషల్  మీడియాలో 24X7 యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ప్రత్యర్థులు,సామాన్యులు తమ నాయకుడి మీద ఎలాంటి విమర్శ చేసినా వెం టనే కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. వీళ్ల నోటి దురుసు చూసి మరోసారి విమర్శించేందుకు సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి. ఈ మధ్య ఓ జిల్లా కేంద్రంలో రోడ్ల దుస్థితిపై ఓ స్థానికుడు ఫేస్ బుక్​లో పోస్ట్ పెట్టాడు. ‘రోడ్లను అద్దం లా మెరి పిస్తానన్న మా ఎమ్మెల్యే ఏడపాయె?’ అనే కామెంట్ చేశాడు. అంతే సదరు ఎమ్మెల్యే యువసేన సభ్యులు రంగంలోకి దిగి, ఇష్ట- మొచ్చినట్లు తిట్టారు. దీంతో ఓటేసిన వ్యక్తిగా ఎమ్మెల్యేను కనీసం ప్రశ్నించే స్వేచ్ఛ కూడా తనకు లేదా? అని ఆ వ్యక్తి వాపోయాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ని శాంతినగర్ కాలనీలో కరోనా నియంత్రణపై వాట్సప్ గ్రూపుల్లో ఇటీవల మొదలైన వాగ్వాదం గొడవకు దారి తీసింది. చివరికి ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ చేరింది. తాజాగా కరోనా టెస్టులు పెంచాలన్నందుకు ఏకంగా గవర్నర్ తమిళి సైపై ‘కేసీఆర్ ఆర్మీ’ పేరిట చిల్లర పోస్టులు పెట్టడంతో అధికార పార్టీ పరువు పోయింది.

హద్దులు దాటుతున్నరు

చాలాచోట్ల ఇలాంటి ఆర్మీలు.. పార్టీ కార్యక్రమాలు, సోషల్ మీడియాలో నేతల ప్రచారం, విపక్ష నేతలపై విమర్శలకే పరిమితమవుతున్నా ఒక్కోసారి అనుచరుల అభిమానం హద్దులు దాటుతోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ‘ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆర్మీ’ పేరిట కొంతమంది టీఆర్ఎస్ యూత్, టీఆర్ఎస్వీ లీడర్లు తమ చర్యలతో తరుచూ వార్తల్లో ఉంటున్నా రు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో మార్చి 25న బెల్లంపల్లి పాత బస్టాం డ్ ఏరియాలో కట్టెలు పట్టు కొని రోడ్లపై తిరుగుతూ హల్చల్ చేశారు. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు ఆలస్యంగా ఐదుగురిపై కేసు ఫైల్ చేశారు. ఈ ఆర్మీలో ఒకరు హైదరాబాద్ లో జరిగి న ఓ కిడ్నాప్ కేసులో, మరొకరు కరీంనగర్ జిల్లాలో జరిగిన యువతి సూసైడ్ కేసులో నిం దితులు. చెన్నూర్ , మంచిర్యాల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే బాల్కసుమన్, ఎమ్మెల్యే దివాకర్రావు తనయుడు వినీత్ రావు అనుచరులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. మంచిర్యాలలో రోడ్ల మీద బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించి, కత్తులు తిప్పడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

కబ్జాలు, సెటిల్మెంట్లు , దందాలు..

ప్రైవేట్ ఆర్మీల ముసుగులో లీడర్ల పేరుచెప్పుకొని కొందరు ల్యాండ్ కబ్జాలు, సెటిల్మెం ట్లు, దందాలకు పాల్పడుతున్నా రనే ఆరోపణలు వస్తున్నాయి . రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి పోలీసులు, ఆఫీసర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా అధికారపార్టీ లీడర్లు కావడంతో చర్యలకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది.

సూర్యాపేట జిల్లాలో ఓ మంత్రి యువసేనలోని అనుచరుడి తీరు వివాదాస్పదమవుతోంది. ఇటీవల మంత్రి పేరు చెప్పి తమ భూమిని, పక్కనే ఉన్న తోవను కబ్జా చేశాడంటూ ట్విట్టర్ ద్వారా ఓ మహిళ స్వయంగా కేటీఆర్కు కంప్లెయింట్ చేయడం కలకలం రేపింది. సూర్యాపేటలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రతిపక్ష నాయకుడొకరు సోషల్ మీడియాలో విమర్శిస్తే సదరు మంత్రి అనుచరగణం చేసిన యాగి అంతా ఇంతా కాదు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యే లకు ఉన్న ప్రైవేటు సేనల ఆగడాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి . ఓ ఎమ్మెల్యే కొడుకు అనుచరులు యువసేన ముసుగులో ప్రభుత్వ భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లలో డైరెక్ట్గా ఇన్వా ల్వ్ అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి . మరో ఎమ్మెల్యే భర్త పేరిట ఉన్న ప్రైవేట్ సైన్యం కూడా సెటిల్మెంట్లలో తలదూరుస్తున్నది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఎమ్మెల్యే పేరిట ఓ రౌడీషీటర్ ప్రైవేట్ ఆర్మీ ఏర్పాటు చేసి ల్యాండ్ సెటిల్మెంట్లు, అరాచకాలు చేస్తున్నా డనే ఆరోపణలు వస్తున్నాయి .

నిజామబాద్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఒలింపి క్ అసోసియేషన్కు చెందిన కోట్ల విలువైన భూములను కబ్జా చేశాడు. దీనిపై యువజన సంఘాలు, వివిధ పార్టీలు ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గాడు. ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ పంచాయితీలో తన వాటా కోసం రివాల్వర్ తో బెదిరించిన ఘటనలో అరెస్ట్ కూడా అయ్యాడు.