
2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. రెండేళ్ల కాలంలోనే 2018 మే 1న కేంద్రం ప్రాజెక్ట్ కు కావాల్సిన అనుమతిలన్నీ ఇచ్చింది. అనుమతులు పొందడమే కాకుండా ప్రాజెక్ట్ లో ప్రధాన పనులన్నీ రికార్డ్ స్థాయిలోనే పూర్తి చేశారు అధికారులు. ప్రభుత్వ సంకల్పానికి.. అధికారులు, ఇంజినీర్ల సహకారం, కృషి తోడవటంతో మూడేళ్లలోనే ప్రాజెక్ట్ ను పూర్తి చేయటం మరో రికార్డ్.
కాళేశ్వరం పూర్తి స్వరూపం ఇదీ
మొత్తం అంచనా వ్యయం 80 వేల 5 వందల కోట్లు కాగా.. ఇప్పటివరకు 50 వేల కోట్ల ఖర్చు చేశారు. మొత్తం మూడు బ్యారేజ్ లు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 15 వందల 31 కిలోమీటర్ల కాల్వలతో ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ ప్రాజెక్టులో 518 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేస్తారు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోయనుండగా.. 4వేల 992 మెగావాట్ల విద్యుత్ అవసరమౌతోంది. ఒక టీఎంసీ ఎత్తిపోతకు 447 కోట్ల ఖర్చవుతుంది. ప్రాజెక్ట్ తో 21 జిల్లాలు లబ్ధి పొందనుండగా.. 37 లక్షల ఎకరాలకు నీరందనుంది. ఈ ప్రాజెక్టులో 80వేల ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ఇప్పటికే 55వేల ఎకరాలు సేకరించారు. భూసేకరణకు 4వేల 550కోట్లు, నిర్వాసితులకు 550 కోట్లకుపైగా చెల్లించారు. మొత్తంగా కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణాల్లో సగటున రోజూ 60వేల మంది కూలీలు పనిచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మొదటి ఘట్టం మేడిగడ్డ బ్యారేజ్. 85 గేట్లతో గోదావరి నదిపై 1.63 కిలోమీటర్ల వెడల్పుతో ఇక్కడ బ్యారేజ్ నిర్మించారు. 16.37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రూపొందిన మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి పంప్ హౌజ్ కు నీరు చేరుతుంది.
కన్నెపల్లి పంప్ హౌజ్ లో బాహుబలి మోటర్లు
కన్నెపల్లి పంప్ హౌజ్ దగ్గర నీటిని ఎత్తిపోసేందుకు 11 భారీ మోటార్లు ఏర్పాటు చేశారు. 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ మోటార్లు.. రోజూ 2 టీఎంసీల నీటిని 49 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోస్తాయి. కన్నెపల్లి పంప్ హౌజ్ లోని భారీ గొట్టాలతో వచ్చే నీరు కాలువ ద్వారా అన్నారం బ్యారేజికి చేరుతుంది. భూపాలపల్లి జిల్లాలోని అన్నారం దగ్గర 10.87 టీఎంసీల సామర్థ్యం.. 66 గేట్లతో 1వందల 270 మీటర్ల పొడవున అన్నారం బ్యారేజ్ నిర్మించారు. అన్నారం పంప్ హౌజ్ లో 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 8 భారీ మోటార్లు ఏర్పాటు చేశారు. ఈ మోటార్లు 34 మీటర్ల ఎత్తుకు పంప్ చేసి.. నీటిని 12 వందల మీటర్ల దూరంలోని సుందిళ్ల బ్యారేజ్ లోకి ఎత్తిపోస్తాయి.
పెద్దపల్లి జిల్లా సిరిపురం దగ్గర సుందిళ్ల బ్యారేజ్ ను నిర్మించారు. 14 వందల 62 మీటర్ల పొడవైన ఈ బ్యారేజ్ కు 74 గేట్లున్నాయి. సుందిళ్ల బ్యారేజ్ నీటినిల్వ 8.83 టీఎంసీలు. ఈ బ్యారేజ్ కు రెండు వైపులా ఎనిమిదిన్నర కిలోమీటర్ల కరకట్ట నిర్మించారు. బ్యారేజ్ కు అనుసంధానంగా 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9 మోటార్లతో.. గోలివాడ పంప్ హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి రోజుకు రెండున్నర టీఎంసీలను 40 మీటర్లు ఎత్తిపోసి ఎల్లంపల్లి రిజర్వాయర్ కు తరలిస్తారు.
బ్యారేజీలు, రిజర్వాయర్లను లింక్ చేసే ఎల్లంపల్లి
కాళేశ్వరంలోని బ్యారేజ్ లు, రిజర్వాయర్లను లింక్ చేస్తూ కట్టిన ప్రాజెక్ట్ ఎల్లంపల్లి. ఈ ప్రాజెక్ట్ నుంచే 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఎల్లంపల్లి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు అయినప్పటికీ.. దాదాపు 2 వందల టీఎంసీల నీరు ఇక్కడి నుంచి ప్రవహిస్తుంది.
ఎల్లంపల్లి నుంచి 9.53 కిలోమీటర్ల పొడవైన రెండు భారీ సొరంగ మార్గాల ద్వారా.. గోదావరి జలాలు పంప్ హౌస్ లకు, అక్కడి నుంచి మేడారం రిజర్వాయర్ కు వస్తాయి. రామడుగులో ఏర్పాటు చేసిన బాహుబలి మోటార్లు.. ఈ నీటిని సర్జిపూల్ నుంచి SRSP వరద కాలువలోకి ఎత్తిపోస్తాయి. అక్కడి నుంచి ఎత్తిపోసే నీళ్లు మిడ్ మానేరుకు చేరుకుంటాయి. 25.87 టీఎంసీలు నిల్వ సామర్థ్యం ఉన్న మిడ్ మానేరు నుంచి.. గ్రావిటీ కెనాల్, టన్నెళ్ల తో అనంతగిరి, శ్రీరంగనాయక సాగర్ రిజర్వాయర్లకు నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి మల్లన్నసాగర్ కు నీళ్లు చేరుకుంటాయి.
ఆరు జిల్లాల ఆయకట్టుకు మల్లన్నసాగర్ నీళ్లు
17 వేల ఎకరాల వైశాల్యం, 23 కిలోమీటర్ల చుట్టుకొలత, 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించబడింది మల్లన్నసాగర్ రిజర్వాయర్. ఆరు జిల్లాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్ట్ నీరందించనుంది. ప్రస్తుతం మల్లన్నసాగర్ పనులు జరుగుతుండగా.. వచ్చే ఏడాది జులై నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మల్లన్నసాగర్ పూర్తియితే ఒక కాలువ ద్వారా సింగూరు వైపు నీటిని తరలించనున్నారు. మరో కాలువ నుంచి కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్ నీరు సరఫరా కానుంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తంలో 28 ప్యాకేజీలు ఉండగా,. ఇందులో ప్యాకేజీ 8 హైలెట్ గా నిలుస్తోంది. బాహుబలి మోటార్లతో పాటు భారీ టన్నెల్ ను ఇక్కడే నిర్మించారు. 250 మీటర్ల లోతులో 14.9 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించగా.. అందులో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్లు ఏర్పాటు చేశారు. ఒక్కో మోటార్ 115 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తాయి. ఇంతటి భారీ మోటార్లు దేశంలోనే తొలిసారిగా కాళేశ్వరంలో వాడినట్లు అధికారులు చెబుతున్నారు.
కొత్తగా 18లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లు
ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్తగా 18లక్షల 25వేల 7వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుంది. 13 జిల్లాల్లోని 106 మండలాల్లో గల 15వందల 81 గ్రామాలు లబ్ధి పొందనున్నాయి. ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల ప్రజల తాగునీటి కోసం 10 టీఎంసీలు.. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీలు అందనున్నాయి. ఇక పరిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు వినియోగిస్తారు.