మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ

మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ
  • రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు
  • శని, ఆదివారాల్లో లాక్ డౌన్

ముంబై: కరోనా కట్టడి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. సెకండ్ వేవ్ దెబ్బకు వణికిపోతున్న మహారాష్ట్ర సోమవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో పరిస్థితిని అదుపుచేసేందుకు సీఎం ఉద్దవ్ థాకరే అధ్యక్షతన సమావేశమైన మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేసులు పెరుగుతున్న జిల్లాల్లో ఇప్పటికే లాక్ డౌన్ అమలు చేస్తున్నా కేసులు తగ్గకపోవడంతో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని మంత్రివర్గ సమావేశం అభిప్రాయపడింది. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుండడంతో గత్యంతరం లేక రాత్రిపూట కర్ఫ్యూ విధించాల్సి వచ్చిందని.. శుక్ర వారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు కంప్లీట్ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇన్ని చర్యలు అమలు చేసినా కేసులు తగ్గకపోతే లాక్ డౌన్ విధించాల్సి వస్తుందని ప్రభుత్వం హెచ్చరించింది. 

ఆఫీసుల్లో 50 శాతం సిబ్బందితోనే పని.. 
కరోనా వేగంగా విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ కార్యాలయాలయలో సగం శాతం సిబ్బందితోనే పనులు చేయించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. అలాగే ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు ఇళ్ల దగ్గర నుంచే పని చేసేలా చర్యలు తీసుకోవాలని.. వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. కర్ఫ్యూ సమయంలో హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లు, బార్లను పూర్తిగా మూసివేస్తారు. హోటళ్లలో కూర్చుని తినే అవకాశం లేకుండా.. పార్శిల్ ఇచ్చే పద్ధతి అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు నిర్దేశించిన మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ చేసింది.