ముంబైలో రేపటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ

ముంబైలో రేపటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ

ముంబై: మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ పెరుగుతున్న కేసులు.. సెకండ్ వేవ్ సింప్టమ్స్.. కొత్త రకం కరోనా కేసులు బయటపడుతుండడంతో ఇప్పటికే 4 జిల్లాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్న ప్రభుత్వం రాజధాని ముంబైలో రేపట్నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రకరకాల వేరియంట్లు ఆందోళన కలిగిస్తుంటే.. కొత్తరకం కరోనా బయటపడడం గుబులు రేపుతోంది. రెండుసార్లు రూపాంతంరం చెందే (డబుల్ మ్యూటెంట్) వైరస్ 18 రాష్ట్రాల్లో నమోదు అయినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించడంతో మహారాష్ట్ర మరింత కఠిన నిర్ణయాలకు సిద్ధమైంది. ఆదివారం రాత్రి నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 10 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. షాపింగ్ మాల్స్, హోటళ్లు, పబ్బులు రాత్రి 8 నుంచి ఉదయం 7  వరకు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం
ముంబైలో బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ నిషేధం విధించింది. వీలైనంత వరకు సామూహిక కార్యక్రమాలకు దూరంగా.. సోషల్ డిస్టెన్స్ మర్చిపోవద్దని పదేపదే హెచ్చరికలు చేస్తోంది. కేసులు పెరుగుతుండటంతో ఎలాంటి పండుగలకు అవకాశం లేకుండా నాగ్‌‌‌‌పూర్‌‌‌‌లో మార్చి 31 వరకు అధికారులు లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ విధించారు. మతపర అన్ని కార్యక్రమాలపై నిషేధం విధించారు. నాందేడ్‌‌‌‌, బీడ్‌‌‌‌, పర్భణిల్లో ఏప్రిల్​ 4 వరకు లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ విధించిన ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తోంది. అత్యవసరమైన కొన్ని కార్యక్రమాలకు 20 మందికి మించి హాజరవొద్దని ఆంక్షలు పెట్టారు. పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనేవారి సంఖ్యను చాలా వరకు పరిమితంగా ఉండాలని స్పష్టం చేసింది. మురికి వాడల కంటే అపార్టుమెంట్లలోనూ... పెద్ద పెద్ద కాంప్లెక్సుల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లు, మందులు సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసింది. రానున్న రోజుల్లో సెకండ్ వేవ్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది అంతుచిక్కని పరిస్థితి ఉండడంతో ప్రజలు సంయమనం పాటించి కరోనాను పారదోలాలని ప్రభుత్వం కోరుతోంది.