గుకేశ్‌‌‌‌ వ్యూహానికి ఉక్కిరిబిక్కిరయ్యా: సిందరోవ్‌‌

గుకేశ్‌‌‌‌ వ్యూహానికి ఉక్కిరిబిక్కిరయ్యా: సిందరోవ్‌‌

జెనీవా:  ప్రపంచ చెస్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ మూడో గేమ్‌‌లో డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ డి. గుకేశ్‌‌ వేసిన ఎత్తులకు తాను ఉక్కిరిబిక్కిరైనట్లు చాలెంజర్‌‌ జావోఖిర్‌‌ సిందరోవ్‌‌ (ఉజ్బెకిస్థాన్‌‌) అంగీకరించాడు. నల్లపావులతో ఆడిన గుకేశ్‌‌.. ఆరంభంలోనే అత్యుత్తమ సన్నద్ధతతో బరిలోకి దిగి తనపై ఒత్తిడి పెంచాడని పేర్కొన్నాడు. వరుసగా మూడో గేమ్‌‌ కూడా డ్రాగా ముగియడంతో ఇరువురు ఆటగాళ్లు 1.5–1.5 పాయింట్లతో సమంగా నిలిచారు. ఈ మ్యాచ్‌‌లో తొలిసారిగా గుకేశ్‌‌ ఆరంభ ఎత్తులను వేగంగా కదపగా.. తెల్లపావులతో ఆడిన సిందరోవ్‌‌ ఎక్కువ సమయం ఆలోచిస్తూ గడిపాడు.

దాదాపు 15వ ఎత్తు వరకు గుకేశ్‌‌కు అన్నీ తెలిసినట్లే ఆడాడని, దాంతో సమయ పాలనలో తాను ఇబ్బందిపడ్డానని సిందరోవ్‌‌ తెలిపాడు. ఆఖరి ఎత్తుకు కేవలం 7 సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉన్నా.. సిందరోవ్‌‌ అద్భుతంగా రక్షణాత్మక ఆటతీరుతో గేమ్‌‌ను డ్రా చేసుకోగలిగాడు. 14 గేమ్‌‌ల ఈ సుదీర్ఘ పోరులో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, ఇద్దరం అత్యుత్తమ చెస్‌‌ ఆడుతుండటం వల్లే విజయాలు సులభంగా దక్కడం లేదని గుకేశ్‌‌ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం తొలి విశ్రాంతి దినం కాగా.. శనివారం జరిగే నాలుగో గేమ్‌‌లో గుకేశ్‌‌ తెల్లపావులతో ఆడనున్నాడు.