బషీర్‌బాగ్, వెలుగు : బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ ఏజెంట్ చేతుల్లో మోసపోయి.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 12 మంది భారతీయులను తిరిగి వెనక్కి తీసుకురావాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ.. గతేడాది హైదరాబాద్‌లోని నాంపల్లి బజార్‌ఘాట్ ప్రాంతానికి మహమూద్ అస్ఫాన్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 12 మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లినట్లు అసదుద్దీన్ తెలిపారు.
అక్కడి నుంచి స్థానిక ఏజెంట్ ఎక్కువ జీతం వస్తుందని.. రష్యా దేశంలో సెక్యూరిటీ లేబర్‌గా పని చేయాలని వారిని రష్యాకు పంపించారు. అక్కడికి వెళ్లిన వారిని రష్యా ఆర్మీలో సెక్యూరిటీ లేబర్‌గా తీసుకున్నారు. అమాయకులైన వారికి తుపాకులు ఇచ్చి, ఉక్రెయిన్ యుద్ధంలో పని చేయించుకున్నారని వివరించారు. గతేడాది డిసెంబర్ 31న రష్యన్ ఆర్మీతో కలిసి ఉక్రెయిన్ దేశంలోకి వెళ్లిన అనంతరం వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదన్నారు.
వారి ఆచూకీ కోసం నాంపల్లి ప్రాంతానికి చెందిన మహమ్మద్ అస్ఫాన్ కుటుంబ సభ్యులు , దారుసలంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో బుధవారం ఎంపీ అసద్‌ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు, కర్ణాటక, గుజరాత్, యూపీ, జమ్మూకశ్మీర్ నుంచి 12 మంది వరకు ఉక్రెయిన్ లో చిక్కుకున్నారని వాపోయారు. వారిని ఇక్కడికి తీసుకు వచ్చేందుకు ప్రధాని, విదేశాంగ మంత్రులతో మాట్లాడుతానని అసద్ వారికి హామీ ఇచ్చారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విదేశాంగ మంత్రి జయశంకర్‌కు బాధితులను త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కోరారు.
