హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి..ఆర్  కృష్ణయ్య  డిమాండ్

హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి..ఆర్  కృష్ణయ్య  డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించకపోతే వేలాది మంది విద్యార్థులతో ప్రజా భవన్ ను స్వాధీనం చేసుకుంటామని రాజ్యసభ సభ్యుడు ఆర్  కృష్ణయ్య హెచ్చరించారు. రాష్ట్రంలోని 325 బీసీ హాస్టళ్లు, 320 బీసీ గురుకులాలకు ప్రభుత్వ స్థలాలను కేటాయించి సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్  చేశారు.

హైదరాబాద్  బషీర్ బాగ్  ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేశ్​ ఆధ్వర్యంలో విద్యార్థుల కోర్  కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. హాస్టళ్లకు 8 నెలలుగా మెస్  బిల్లుల బకాయిలు చెల్లించలేదని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్  చేశారు.

అద్దె భవనాల బకాయిలు కూడా మూడేళ్లుగా చెల్లించడం లేదన్నారు. దీంతో ఓనర్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు విక్రయించకుండా హాస్టళ్లు, గురుకులాలకు ఆ స్థలాలు కేటాయించాలని డిమాండ్  చేశారు.

హాస్టల్​ బిల్డింగ్​ల నిర్మాణానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా 150 బీసీ కాలేజీ హాస్టళ్లను మంజూరు చేయాలని, 240 బీసీ రెసిడెన్షియల్  స్కూళ్లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని
 హెచ్చరించారు.