- 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు
- ఆక్సిజన్ ఉత్పత్తికి భారీగా నిధుల కేటాయింపు
- 10వేల అదనపు ఆక్సిజన్ పైప్ లైన్ల ఏర్పాటుకు సన్నాహాలు
- డిమాండ్ తట్టుకునేందుకు 50 క్రయోజనిక్ ట్యాంకర్ వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయం
అమరావతి: ఏపీ ప్రభుత్వం ఆక్సిజన్ ఉత్పత్తిని భారీగా పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 49 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్వహణ కట్టుదిట్టంగా సాగేలా సన్నాహాలు చేస్తోంది. కరోనా మహమ్మారి విజృంభణ నేపధ్యంలో ఆక్సిజన్ కోసం దేశ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా.. రవాణా వ్యవస్తలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా గ్రీన్ ఛానెల్ కు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆక్సిజన్ ఉత్పత్తికి రూ.309.87 కోట్లు కేటాయించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆక్సిజన్ ప్లాంట్ల ఉత్పత్తికి భారీగా నిధుల కేటాయింపు
ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో రూ.309.87 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు, 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మరో 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్‌లైన్ల ఏర్పాటు చేయాలని, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణకు ప్రతి జిల్లాకు వచ్చే 6 నెలలకు రూ.60 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. కరోనా చికిత్స విషయంలో ఆక్సిజన్ కు భారీగా డిమాండ్ ఏర్పడడంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసేందుకు సీనియర్ ఏఐఎస్ అధికారిని పర్యవేక్షకుడిగా నియమించింది. పర్యవేక్షణ ఇంఛార్జ్‌గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఏపీకి పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ దిగుమతితోపాటు లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాలపై కూడా దృష్టి పెట్టనున్నారు.
