సమాజాభివృద్ధిలో సోషల్ వర్కర్లది కీ రోల్

సమాజాభివృద్ధిలో సోషల్ వర్కర్లది కీ రోల్
  • డాక్టర్ పి.హనుమంతరావు

సికింద్రాబాద్, వెలుగు: దేశానికి భవిష్యత్​అయిన చిన్నారుల అభివృద్ధిపై సోషల్​వర్కర్లు ఎక్కువగా దృష్టిపెట్టాలని   పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పి.హనుమంతరావు సూచించారు.  సమాజాభివృద్ధిలో సోషల్ వర్కర్ల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు.  ప్రస్తుతం సమాజంలో ఎన్నో రకాలైన సామాజిక అసమానతలు, కుటుంబాల్లో సమస్యలు పెరుగుతున్నాయని, వాటి నుంచి బయటపడేలా సోషల్​వర్కర్లు ప్రజలకు సపోర్ట్​ఇవ్వాలని సూచించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ‘ సోషల్ వర్క్​టీచింగ్,లెర్నింగ్​లో సవాళ్లు’ అంశంపై సికింద్రాబాద్​ పీజీ కాలేజీలో రెండురోజుల  సదస్సుకు శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. ఇటీవలి కాలంలో చిన్నారుల్లో ఆటిజం, ఏడీహెచ్​డీ లాంటి సమస్యలు పెరుగుతున్నాయన్నారు. 

దేశంలో ప్రస్తుతం చిన్నారుల్లో 14 శాతం మంది వివిధ రకాలైన లెర్నింగ్​డెఫిషియెన్సీతో బాధపడుతున్నారన్నారు. అలాంటి వారిని గుర్తించి సరైన సమయంలో ఇంటర్వెన్షన్, క్వాలిటీ ట్రైనింగ్​ఇస్తే వారిలో చాలావరకు సమస్యను తగ్గించవచ్చన్నారు. పర్యవరణ పరిరక్షణకు సోషల్​వర్కర్లు కృషి చేయాలని ప్రముఖ పర్యావరణవేత్త, రిటైర్డ్​ ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి సూచించారు.   కార్యక్రమంలో కాలేజీ  ప్రిన్సిపాల్ ప్రొఫెసర్​ అర్జున్​రావు, సింపోజియం కన్వీనర్ ప్రొఫెసర్​ పి.శ్రీనివాస్ రెడ్డి    తదితరులు పాల్గొన్నారు.