లిక్కర్​ కేసు​ అప్​డేట్​: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా బెయిల్​ పిటిషన్​ కొట్టివేత

లిక్కర్​ కేసు​ అప్​డేట్​:  ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా బెయిల్​ పిటిషన్​ కొట్టివేత

లిక్కర్ స్కామ్ (Liquor Scam)కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు మంగళవారం ( మే 21)నాడు తోసిపుచ్చింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో బెయిల్ ఇవ్వాలని సిసోడియా కోరారు. కానీ ధర్మాసనం తిరస్కరించింది. మనీష్ సిసోడియా దాఖలు చేసిన ఇది రెండో బెయిల్ పిటిషన్.లిక్కర్ పాలసీ కేసులో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కొంతమందికి లాభదాయకంగా పాలసీని రూపొందించినట్లుగా తెలిపింది. కొంతమంది వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే భాగంలో అవినీతికి పాల్పడినట్లు న్యాయస్థానం పేర్కొంది.

ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి ప్రైవేటు వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూర్చే విధంగా లిక్కర్ పాలసీని రూపొందించారన్న ఆరోపణలను సిసోడియా ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి 2023 ఫిబ్రవరి 6న సీబీఐ ఆయనను అరెస్టు చేయగా, ఇదే కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో 2023 మార్చి 9న ఈడీ అరెస్టు చేసింది. ఈ రెండు కేసుల్లో తనకు బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు తాజాగా తోసిపుచ్చింది. డాక్యుమెంట్లు సప్లయి చేయడంలో ప్రాసిక్యూషన్ జాప్యం కానీ, అభియోగాల నమోదు విషయంలో విచారణ కోర్టు జాప్యం కానీ ఏమీ లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే, అస్వస్థతగా ఉన్న తన భార్యను ప్రతి వారం కలుసుకుంనేదుకు విచారణ కోర్టు షరతులపై అనుమతిస్తున్నట్టు కోర్టు తెలిపింది. కాగా, బెయిలు నిరాకరిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టును సిసోడియా ఆశ్రయించనున్నారు