జనవరిలో హౌసింగ్‌‌ బోర్డు ఫ్లాట్ల విక్రయం..హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో 339 ఫ్లాట్లు రెడీ

జనవరిలో హౌసింగ్‌‌ బోర్డు ఫ్లాట్ల విక్రయం..హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో 339 ఫ్లాట్లు రెడీ
  • గచ్చిబౌలి, ఖమ్మం, వరంగల్‌‌లో 339 ఫ్లాట్లు అందుబాటులో

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లోని గచ్చిబౌలి, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో మొత్తం 339 ఫ్లాట్లను అమ్మాలని హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. తక్కువ ఆదాయ వర్గాలకు (ఎల్‌‌ఐజీ) మంచి వసతులతో కూడిన సొంతింటి వసతిని కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఫ్లాట్లను విక్రయిస్తోంది. 

ఈ ఫ్లాట్లన్నీ అబివృద్ధి చెందిన, అత్యధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని ఉన్నా కూడా బహిరంగ మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరలకు హౌసింగ్ బోర్డు విక్రయిస్తోంది. ఈ ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు అధికారులు గైడ్ లైన్స్ ఖరారు చేశారు. ఏడాదికి రూ.6 లక్షల ఆదాయం ఉన్న వారికే కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. 

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ దగ్గర 111 ఫ్లాట్లు, వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని అపార్ట్‌‌మెంట్‌‌లో 102, ఖమ్మంలో శ్రీరామ్ హిల్స్ వద్ద 126 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. లాటరీ పద్ధతిలో ఇండ్లను కేటాయించనున్నారు. గచ్చిబౌలిలో ఫ్లాట్ల ధర రూ.26 లక్షల నుంచి రూ.36.20 లక్షల వరకు ధరలు ఉన్నాయి. 

వరంగల్‌‌లో రూ.19 లక్షల నుంచి రూ.-21.50 లక్షలు, ఖమ్మంలో రూ.11.25 లక్షల్లో ఫ్లాట్ల ధరలు ఉన్నాయి. ఫ్లాట్ల కొనుగోలుకు జనవరి 3 వరకు ఆన్‌‌లైన్‌‌ లేదా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. గచ్చిబౌలిలోని ఫ్లాట్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ జనవరి 6న, వరంగల్‌‌లోని 8న, ఖమ్మంలో 10న నిర్వహిస్తారు. మరిన్ని వివరాలు https://tghb.cgg.gov.inలో అందుబాటులో ఉన్నాయి.