- కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ చామల కౌంటర్
న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల అవినీతిపై ఎందుకు బహిరంగ లేఖలు రాయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ చామల కౌంటర్ ఇచ్చారు. రెండేండ్ల పాలనపై సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాయడంపై చామల ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ఎంపీల తీరుపై స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ పిలిచి చీవాట్లు పెట్టారని గుర్తుచేశారు. తెలంగాణలో బీజేపీ దయనీయ స్థితికి గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డినే కారణమని మోదీ గమనించారని విమర్శించారు.
అందుకే.. మోదీని ప్రసన్నం చేసుకునేందుకు సోనియాకు లేఖ రాశారని వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ రెండేండ్ల పాలనపై ఆందోళన చెందుతున్న కిషన్ రెడ్డి.. మరి బీఆర్ఎస్ పదేండ్ల అవినీతిపై ఎందుకు బహిరంగ లేఖలు రాయలేదు”అని చామల ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేండ్లు తెలంగాణ సొమ్మును దోచుకున్నప్పుడు, కాళేశ్వరం పేరుతో భారీ అవినీతికి పాల్పడినప్పుడు కిషన్ రెడ్డి ఎందుకు మౌనం దాల్చారని నిలదీశారు. కేంద్రం చేతిలోనే ఉన్న ఐటీ, సీబీఐ, ఈడీ దర్యాప్తులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ, ప్రత్యేకించి కిషన్ రెడ్డికి తెలంగాణపై నిజంగా ప్రేమే ఉంటే మిగులు తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మారకుండా చూసేవారని అన్నారు.
