రైల్వే చార్జీల పెంపు..215 కి.మీ. దాటితే టికెట్ రేట్లు హైక్

రైల్వే చార్జీల పెంపు..215 కి.మీ. దాటితే టికెట్ రేట్లు హైక్
  • ఆర్డినరీ టికెట్లపై కి.మీ.కు పైసా, ఏసీ ట్రెయిన్ టికెట్లపై 2 పైసలు పెంపు 
  • ఈ నెల 26 నుంచి అమలులోకి

న్యూఢిల్లీ: రైల్వే చార్జీలు స్వల్పంగా పెరిగాయి. పెరిగిన టికెట్ రేట్లు ఈ నెల 26 నుంచి అమలులోకి రానున్నాయి. సబ్ అర్బన్ ట్రెయిన్ లతోపాటు 215 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు చార్జీల్లో మాత్రం ఎలాంటి పెంపుదల లేదని ఈ మేరకు రైల్వే శాఖ ఆదివారం ప్రకటించింది. రైల్వే శాఖ అనౌన్స్ మెంట్ ప్రకారం.. 215 కిలోమీటర్లకుపైబడిన దూరాలకు గాను ప్రతి కిలోమీటర్ కు ఒక పైసా చొప్పున చార్జీలు పెరగనున్నాయి. 

మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ లలో నాన్ ఏసీ కోచ్ లలో చార్జీలు ప్రతి కిలోమీటర్ కు 2 పైసల చొప్పున పెరగనున్నాయి. అలాగే ఏసీ కోచ్ లలో ప్రయాణాలకు కూడా ప్రతి కిలోమీటరుకు 2 పైసల చొప్పున చార్జీలు హైక్ కానున్నాయి. ఉదాహరణకు.. నాన్ ఏసీ కోచ్ లలో 500 కిలోమీటర్ల ప్రయాణానికి గాను రూ. 10 అదనంగా చార్జీలు వర్తించనున్నాయి. 

గత దశాబ్దకాలంలో రైల్వే నెట్ వర్క్ ను గణనీయంగా విస్తరించామని, మ్యాన్ పవర్ ను కూడా పెంచామని.. అందుకే నిర్వహణ భారాన్ని కొంత తగ్గించేందుకే చార్జీలు పెంచుతున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. తాజా చార్జీల పెంపుతో రైల్వేకు ఏటా రూ. 600 కోట్ల ఆదాయం పెరుగుతుందని పేర్కొంది. అయితే, రైల్వే మ్యాన్ పవర్ కాస్ట్ ఏడాదికి రూ. 1,15,000 కోట్ల మేరకు, పెన్షన్ వ్యయం రూ. 60 వేల కోట్ల మేరకు పెరిగినట్టు రైల్వే వెల్లడించింది. 

మొత్తంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ (2024–25)లో రైల్వే నిర్వహణా వ్యయం రూ. 2,63,000 కోట్లకు పెరిగినట్టు వివరించింది. పెరిగిన నిర్వహణ వ్యయాన్ని సర్దుబాటు చేసేందుకుగాను కార్గో లోడింగ్ ను పెంచుతున్నామని, అలాగే ప్యాసింజర్ చార్జీలను కూడా స్వల్పంగా పెంచామని రైల్వే తెలిపింది. 

చివరిసారిగా జులైలో చార్జీల పెంపు.. 

రైల్వే శాఖ చివరిసారిగా ఈ ఏడాది జులైలో మెయిల్, ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ ల నాన్ ఏసీ క్లాస్ చార్జీలను కిలోమీటరుకు పైసా చొప్పున, ఏసీ క్లాస్ లకు 2 పైసాల చొప్పున పెంచింది. అంతకుముందు 2020, జనవరి 1న చార్జీలు పెరిగాయి. ఆర్డినరీ ట్రెయిన్ టికెట్ చార్జీలు కిలోమీటరుకు పైసా చొప్పున.. మెయిల్/ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ లలో సెకండ్ క్లాస్ టికెట్ చార్జీలు కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెరిగాయి. అలాగే స్లీపర్ క్లాస్ లకు 2 పైసలు, అన్ని ఏసీ క్లాస్ లకు 4 పైసల చొప్పున చార్జీలు హైక్ అయ్యాయి.