- ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల నిర్ణయం
- సజ్జనార్ అధ్యక్షతన కమాండ్ సెంటర్‌లో తొలి సమావేశం
- కేసు పురోగతిపై సమీక్ష
- రాజకీయ ప్రముఖులు, అధికారులను ప్రశ్నించనున్న సిట్
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటీ) దూకుడు పెంచింది. సిట్ ఏర్పాటైన తర్వాత ఆదివారం తొలిసారి భేటీ అయ్యింది. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో సిట్ చీఫ్ సీపీ సజ్జనార్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో 9 మంది సిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అధికారులుగా ఉన్న ప్రస్తుత సిద్దిపేట సీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి కేసు దర్యాప్తు గురించి వివరించారు. ఈ మేరకు సిట్ బృందం కేసు పురోగతిని సమీక్షించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం ఉన్న ప్రతిఒక్కరినీ విచారించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది.
కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు కస్టోడియల్ విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా పలువురు రాజకీయ నాయకులతో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా విచారించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున అత్యంత జవాబుదారీతనంతో వ్యవహరించాలని, ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాలని సజ్జనార్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
ఈ కుట్రలో భాగస్వాములైన రాజకీయ ప్రముఖులను, అధికారులను వరుసగా పిలిపించి విచారించనున్నారు. ఇప్పటికే సేకరించిన ఆధారాలు, టెక్నికల్ డేటా, ప్రభాకర్ రావు వాంగ్మూలం ఆధారంగా తదుపరి అరెస్టులు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ భేటీ నేపథ్యంలో వారం రోజుల్లోనే కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.
