హైదరాబాద్/షాద్‌నగర్, వెలుగు: మనిషి జీవితంలో శారీరక, మానసిక వ్యాయామం ఎంతో విలువైందని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. ప్రపంచ మెడిటేషన్ దినోత్సవం సందర్భంగా ఆదివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతి వనంలో నిర్వహించిన మెడిటేషన్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా వైస్ ప్రెసిడెంట్‌తో పాటు మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు.
అనంతరం కన్హా ధ్యాన కేంద్రంలో వివిధ దేశాల నుంచి వచ్చిన వేల మంది అభ్యాసికులతో కలిసి ధ్యానం చేశారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలకు మంచిని పంచడంలో మన దేశం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ధ్యానం, వ్యాయామం వల్ల మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు.
ప్రతి ఒక్కరు ధ్యానం అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ధ్యానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని కల్పిస్తున్న కన్హా నిర్వహకులకు వైస్ ప్రెసిడెంట్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
