- గత సర్కార్ చేసిన ఆర్థిక విధ్వంసం వల్లే కాస్త లేట్
- విద్యారంగం అభివృద్ధికి సర్కారు కట్టుబడి ఉందని వెల్లడి
- టీఆర్టీఎఫ్ సదస్సులో ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: ‘‘టీచర్లు బడిలో ప్రశాంతంగా పాఠాలు చెప్పాలి.. మీ కష్టనష్టాలు, ఆర్థిక సమస్యలు చూసుకునే బాధ్యత మాది. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్లే బిల్లులు, ఇతర అంశాల్లో కాస్త ఆలస్యమవుతున్నది. వాటన్నింటినీ సరిచేస్తాం. పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తాం’’ అని టీచర్లకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఆదివారం నాగోల్లో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) 80 వసంతాల అభ్యుదయోత్సవం, విద్యా సదస్సును సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యావ్యవస్థ ప్రక్షాళన మొదలుపెట్టిందన్నారు.
రికార్డు స్థాయిలో కేవలం నాలుగు నెలల్లోనే డీఎస్సీ నిర్వహించి 11 వేల పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. 37 వేల మందికి బదిలీలు, 23 వేల మందికి ప్రమోషన్లు కల్పించామని వెల్లడించారు. విద్యా కమిషన్ నివేదిక రాగానే దానికి తగ్గట్టు ముందుకు వెళ్తామన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, పిల్లలకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా టీచర్లు పనిచేయాలని పిలుపునిచ్చారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత పదేండ్ల పాలనలో టీచర్లకు జీతాలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఒకటో తారీఖునే వేతనాలు వేస్తున్నామని చెప్పారు. జీవో 317 బాధితులకు న్యాయం జరిగే వరకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, ఓయూ ప్రొఫెసర్ కాశీం, అక్షర వనం ఫౌండేషన్ శ్రీపతిరెడ్డి, డాక్టర్ బిల్లి యాదయ్య, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నిఖిలేశ్వర్, విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
