- స్థానికుల భారీ ర్యాలీ.. ఉద్రిక్తత
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ భగాయత్ లో కొత్తగా ఏర్పాటు చేసిన వైన్స్‌ను ఇక్కడి నుంచి తరలించాలని ఆదివారం వందలాది మంది మహిళలు, పురుషులు, చిన్నారులు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలు, ప్లకార్డులతో భారీ ర్యాలీగా వెళ్లి వైన్ షాప్ ఎదుట ధర్నా చేశారు. వివిధ పార్టీలు, మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. వైన్స్‌ను మూసివేయించే ప్రయత్నం చేయగా పోలీసులు వెళ్లి అడ్డుకొని నచ్చజెప్పినా వినకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు షాప్‌ను మూసివేయించారు.
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఉప్పల్ భగాయత్ అసోసియేషన్ లీడర్లు మేకల మధుసూదన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాలభైరవ ఆలయానికి సమీపంలో, రెసిడెన్షియల్ ఏరియాలో వైన్స్ ఏర్పాటుతో మందుబాబులు రోడ్డుపై మద్యం తాగుతూ గొడవలకు దిగుతున్నారని, దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందన్నారు. వైన్స్‌ను తరలించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నేతలు ఫణీందర్, సందీప్, నవీన్, సందీప్ రెడ్డి, మంజుల, గాయత్రి, స్వప్న, మాధవి, భాగ్య, కీర్తన తదితరులు పాల్గొన్నారు.
సాయిప్రియ కాలనీలో..
జవహర్ నగర్ : దమ్మాయిగూడ సాయిప్రియ కాలనీలో వైన్స్ఏర్పాటు చేయొద్దని స్థానికులు డిమాండ్ చేశారు. వైన్‌షాపు ఎదుట ప్లకార్డులతో ధర్నాకు దిగారు. వైన్స్ తో రోజూ సాయంత్రం మహిళలు, విద్యార్థినుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. పోలీసులు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు.
