- రాష్ట్ర సంక్షేమ పథకాలకు ఆయన పేరు పెడతారా?
- ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా సిద్దిపేట ఎమ్మెల్యే తీరు
- మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేట రూరల్, వెలుగు: గాంధీ పేరుతో కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని, నిజంగా ఆయనపై ప్రేమ ఉంటే సంక్షేమ పథకాలకు గాంధీ పేరు పెట్టాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట టౌన్ లో నిర్వహించిన బీజేపీ కొత్త సర్పంచ్ ల సన్మాన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ఎందుకు ధర్నాలు చేస్తున్నారో, వారికే తెలియదన్నారు. 100 రోజుల ఉపాధి హామీ పనిని తమ ప్రభుత్వం 120 రోజులకు పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..? అని ఆయన ప్రశ్నించారు.
మహాత్మా గాంధీ రామరాజ్యం రావాలని కోరుకున్నారని, ఆయన కోరిక ప్రకారమే బీజేపీ నడుచుకుంటుందన్నారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటి సిద్దిపేట జెడ్పీ సీటును కైవసం చేసుకోవడంతో పాటు, సిద్దిపేట మున్సిపాలిటీలో పార్టీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే తమ పార్టీ సర్పంచ్ లను చేర్చుకుంటున్నారని, ఆయన కోటా కిందనే డబ్బులు లేవు గాని, చేర్చుకున్న సర్పంచ్ లకు నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాము అలా చేయాలనుకుంటే బీఆర్ఎస్ లో ఒక్కరు కూడా మిగలరన్నారు. ఈ సభంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, నేతలు వంగ రాంచంద్రారెడ్డి, తుంగ కనకయ్య, సురేశ్ గౌడ్, నందన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
