ఆసియాకప్లో పాక్ను వెంటాడుతున్న గాయాలు

ఆసియాకప్లో పాక్ను వెంటాడుతున్న గాయాలు

ఆసియాకప్ 2022లో పాకిస్థాన్ను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే టోర్నీకి ముందు స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది దూరం అవ్వగా..టోర్నీ  జరుగుతున్న సమయంలో పాక్ మరో షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్ షానవాజ్ దహాని పక్కటెముకల గాయంతో భారత్తో జరిగే మ్యాచ్కు దూరమయ్యాడు. హంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా షానవాజ్ దహని గాయపడ్డాడు. దీంతో అతను టీమిండియాతో ఆడే మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.  ప్రస్తుతం అతని పరిస్థితిని పాకిస్థాన్ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తుందని... గాయం తీవ్రత తెలుసుకునేందుకు స్కాన్ తీయించిందని పేర్కొంది. రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత అతను టోర్నీలో కొనసాగుతాడా లేదా అనే విషయంపై క్లారిటీ వస్తుందని పీసీబీ తెలిపింది. 

పాక్కు దెబ్బమీద దెబ్బ
జట్టులో కీలక పేసర్గా ఉన్న షానవాజ్ దహాని దూరమవడం పాకిస్థాన్కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. టోర్నీ  స్టార్ట్ కావడానికి ముందు పాకిస్థాన్కు షాహిన్ షా అఫ్రిది, మహమ్మద్ వసీం జూనియర్ గాయాలతో  దూరమయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి దహాని చేరాడు. దీంతో ఆ జట్టు బౌలింగ్ లైనప్‌పై ప్రభావం చూపనుంది. అయితే భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపని దహాని.. బ్యాటింగ్‌లో మాత్రం సత్తా చాటాడు. హాంగ్ కాంగ్‌ మ్యాచ్‌లో షానవాజ్ దహాని అద్భుత బౌలింగ్‌తో కీలక వికెట్ తీశాడు. ఇక షానవాజ్ గైర్హాజరీలో మహమ్మద్ హస్నైన్, హసన్ అలీలో ఎవరో ఒకరు తుది జట్టులోకి రానున్నారు.