వెలుగు ఓపెన్ పేజీ.. ఇంగ్లిష్ నేషనలిజం అంటే ఏంది?

వెలుగు ఓపెన్ పేజీ.. ఇంగ్లిష్ నేషనలిజం అంటే ఏంది?

హైదరాబాద్​లోని  తెల్లాపూర్​లో కొల్లూరి సత్తయ్య, అమృతది  ఒక దళిత  ఫ్యామిలీ. సత్తయ్య బీహెచ్ఈఎల్​లో  ఒక  కార్మిక నాయకుడు.  ఆయన  కుటుంబీకులు వాళ్ల తాత ముత్తాతలకు వచ్చిన ఇనామ్​ భూమిని రాజశేఖర్​ రెడ్డి  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  అక్కడి  కాంట్రాక్టర్లు  ప్రభుత్వంతో  కుమ్మక్కై  లాక్కుంటామంటే  తీవ్రంగా కొట్లాడి కాపాడుకున్నారు. 

ఆ కుటుంబం  ఇప్పుడు ఫూలే అంబేద్కర్​  సెంటర్​ ఫర్​  ఫిలాసఫీ అండ్​ ఇంగ్లిష్  ట్రైనింగ్​ అనే పేరుతో  ఒక ఫ్రీ కోచింగ్ సెంటర్​ నడుపుతున్నారు. దాన్ని షార్ట్​ ఫార్మ్​లో  పీఏసీపీఈటీ అంటారు. ఆ పేరుతో అది  దేశంలోని  మారుమూలల నుంచి విద్యార్థుల్ని  తెల్లాపూర్​ రప్పించి ఇంగ్లిషులో ఫూలే, అంబేద్కర్, సావిత్రిబాయి పుస్తకాలు చదివిస్తూ,  చర్చిస్తూ..  ఇంగ్లిష్, కుల వ్యతిరేకతత్వం  నేర్చుకునేట్టు చేస్తుంది. 

ప్ర తి బ్యాచ్​కి 20 మంది అమ్మాయిల్ని, 20 మంది అబ్బాయిల్ని సెలెక్ట్​ చేసి ఉచిత వసతి, తిండి, కోచింగ్​ అందిస్తారు.  మధ్య మధ్య  తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల 50 మంది అమ్మాయిలను మాత్రమే ఎన్నుకుని డేటా సైన్స్​ ట్రైనింగ్​ మూడు  నెలలు ఇస్తారు.  పీఏసీపీఈటీ  26 జనవరి 2022న ప్రారంభమైంది. ఇప్పటికీ  ఇక్కడ దాదాపు 1100 మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఉచితంగా ట్రైనింగ్​ తీసుకున్నారు.  

ఈ జనవరి 26న నాలుగో సంవత్సరం పూర్తి చేసుకున్న  సందర్భంగా  ఇక్కడ ట్రైనింగ్​ పొందిన దాదాపు 90 మంది అమ్మాయిలు రాసిన తమ​ అనుభవాల వ్యాసాలను ‘టీచింగ్​ ఇంగ్లిష్​ నేషనలిజం’ టైటిల్​తో ఒక ఇంగ్లిష్​ పుస్తకం తెచ్చిందీ సెంటర్.  ఇవన్నీ అమ్మాయిలు, అబ్బాయిలు తమ తమ రూములలో,  క్లాస్​ రూంలో,  క్యాంపస్​లో  ఇంగ్లిష్​లో చర్చించుకున్న అవగాహనతో రాసిన వ్యాసాలు. 

ఇంగ్లిష్​లో  విస్తృత చర్చ 

కొల్లూరి సత్తయ్య కరోనా విపత్తు కాలంలో ఒక బువ్వ బండి ప్రారంభించి దాదాపు 400 మంది మైగ్రెంట్​ కూలీలకు మిల్లెట్​  బ్రేక్​ఫాస్ట్​  పెట్టించేవాడు. అదే పద్ధతిలో పిల్లలందరూ తప్పనిసరిగా మిల్లెట్ బ్రేక్​ఫాస్ట్​ మాత్రమే తినాలి. ఇక్కడ బ్రేక్​ఫాస్ట్​పై చర్చ, లంచ్​​పై చర్చ,  డిన్నర్​పై  చర్చ కూడా ఉంటుంది.  ఇది చాయ్​పై చర్చలాగ  హిందీలో  కాదు  ఇంగ్లిషులో ఉంటుంది. ఈ  విద్యార్థులు  ఇక్కడ నేర్చుకునే  అంశాల్లో ఫూలే, సావిత్రిబాయి ఫూలే, అంబేద్కర్​ ఫిలాసఫీతో పాటు డిగ్నిటీ ఆఫ్​ లేబర్​ కీలకమైంది.  

వేరువేరు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు, అబ్బాయిలు విడివిడి రూములలో ముగ్గురు చొప్పున జీవిస్తూ అన్ని రకాల పనులు వాళ్లే చేసుకోవాలి. ఇంగ్లిషులో తప్ప వేరే భాషల్లో కమ్యూనికేషన్​ కుదరకుండా  అరెంజ్​మెంట్​ ఉంటుంది.  అమ్మాయిలు  సావిత్రిబాయిలా, అబ్బాయిలు ఫూలేలా జీవిత పద్ధతులు అలవర్చుకోవాలి. చుట్టుపక్కల ఉండే వందలాది మైగ్రెంట్​ లేబర్​తో వీళ్లు కలిసిమెలిసి ఉండటం కూడా కీలక అంశం.  సెంటర్​లో పనిచేసే వంటవాళ్లకు వీళ్లు అన్ని రకాలుగా సహాయక పనులు కూడా చేయాలి.  

ఒక్కొక్క బ్యాచ్​ 30 రోజుల్లో  ఎలా జీవితాలను  మార్చుకుని తమ తమ ఇండ్లను,  చుట్టూ సమాజాన్ని, తాము చదుకునే  కాలేజీలను శ్రమ గౌరవ జాతీయవాదులుగా మారే వారియర్స్​గా వీళ్లు తిరిగి ఇండ్లకు వెళ్లిపోతారు. 

వారి మాటల్లోనే..

ప్రతి బ్యాచ్​లో ఒక్క నెలలో ఏం నేర్చుకున్నది వీళ్లు ‘లెర్నింగ్ ఇంగ్లిష్​ నేషనలిజం’ పుస్తకంలో రాశారు. సెల్​ఫోన్లు  వచ్చిన  దగ్గర నుంచి విద్యార్థులు వయసుతో  సంబంధం లేకుండా  స్క్రీన్​పై  గంటలు గంటలు గడిపే అలవాటు ఉన్నవారు ఈ సెంటరుకు  వచ్చారు.  నడిచి,  నడవని  కాలేజీ రోజుల్లో  రాత్రి ఒకటి,  రెండు వరకు  మెలకువతో ఉండి ఫోనుపై గడిపి  తెల్లారి 10 గంటలైనా నిద్ర లేవనివారు వచ్చారు. సెంటరుకు  వచ్చినవారిలో ఎస్సీ,  ఎస్టీ,  బీసీ అమ్మాయిలు,  అబ్బాయిలు  ఎక్కువగా ఉన్నా..  బ్రాహ్మణులు,  క్షత్రియులు,  వైశ్యులు  కూడా  వచ్చారు.  

ఇప్పుడు  ఇంగ్లిష్​  టీచర్​గా  ప్రశాంత్​ తివారీ  అనే  మధ్యప్రదేశ్​ బ్రాహ్మణ  యువకుడు ఉన్నాడు.  అతనికంటే  ముందు కేరళకు  చెందిన  ఒక  నాయర్​ స్త్రీ  ముస్లింగా  కన్వర్ట్​ అయి ఈ సెంటరులో కొంతకాలం ఇంగ్లిష్​ చెప్పింది. నేర్చుకున్నది.  ఈ సెంటరులో  సెల్​ఫోన్​ రాత్రి 10కి మాత్రమే అనుమతిస్తారు. అది పేరెంట్స్​తో మాట్లాడుకోవడానికి.  తిరిగి 5.30కి లేచి ఎక్సర్​సైజ్​ క్లాసుకు పోవాలి  కనుక డిసిప్లెన్​  సిస్టమ్​  కాదనడానికి ఉండదు.  టైమ్​కు బ్రేక్​ఫాస్ట్, టైమ్​కు క్లాసు, రీడింగ్, రైటింగ్, నిరంతర  చర్చలు ఊహించనివిధంగా ఉంటాయి. కనుక 30 రోజుల్లో  అలవాట్లన్నీ మారిపోతాయి. 

కుటుంబంలో సైతం చర్చలే

విపరీతమైన మూఢ నమ్మకాలుగల కుటుంబాల నుంచి వచ్చిన  అమ్మాయిలు, అబ్బాయిలు ఫూలే,  సావిత్రిబాయి, అంబేద్కర్​ జీవితం, పుస్తకాలను  ప్రపంచ సిద్ధాంత కాన్సెప్ట్​ను,  శ్రమ  గౌరవాన్ని నేర్చుకుని తిరిగిపోయేవరకు ఇంగ్లిష్​లో  కొత్త ఆలోచనా విధానం గురించి  మాట్లాడగలగాలి. చాలామంది ఆ స్థితికి  చేరారు.  తిరిగిపోయేటపుడు  మేం మారిన మనుషులమయ్యాం.  ఫూలే,  సావిత్రిబాయి  మా మీద  తీవ్రమైన ప్రభావం వేశారు. అయితే  మేం మూఢ నమ్మకాలు,  స్త్రీల స్వేచ్ఛపట్ల భయం, ఇంట్లో బయట స్త్రీ,  పురుష  సమానత్వం  సమస్యను మేం ఎలా ఎదుర్కోవాలి  అనేవి  మా ముందున్న సవాళ్లు.  

ఏ మార్గం ఎన్నుకోవాలి అనే  ప్రశ్నలేసేవారు చాలామంది. వారు రాసిన వ్యాసాల్లో  వాళ్లు ఎలా కుటుంబాలను  మార్చుకున్నారో  కూడా చెప్పారు.   కుటుంబాలను  రిఫామ్​ చేయడం కూడా చర్చల ద్వారానే సాధ్యం.  రిఫామ్​  రెవెల్యూషన్​  కంటే కష్టతరమైంది. పీఏసీపీఈటీలో   రిఫామ్ మీద తీవ్రంగానే చర్చిస్తారు. ముందు విద్యార్థులు సమాజం,  ఫూలే, సావిత్రిబాయి, అంబేద్కర్​ కోరుకున్న,  సాధించిన   రిఫామ్​    తేవచ్చు అని వాళ్లు పుస్తకాలు, వారి జీవితాలను చదవడం ద్వారా ముందు తమలో తాము మార్పు సాధిస్తారు. అలా సాధించిన  రాసిన వ్యాసాలు  మనకు  లెర్నింగ్​ ఇంగ్లిష్​ నేజనలిజంలో  కనిపిస్తాయి. 

నేషనలిజం ఎటు పయనించాలి?

రిలీజియస్​ నేషనలిజం అధికారం నుంచి రుద్దబడుతున్న ఈ రోజుల్లో  దేశంలో ఉత్పత్తి, శ్రమ గౌరవం, స్త్రీ, పురుష  సమానత్వం నేషనలిజాన్ని పీఏసీపీఈటీ విద్యార్థులకు బోధిస్తుంది. మరీ ముఖ్యంగా విద్యార్థులు తమంత తామే నూతన మానవులుగా దిద్దుకునే ప్రక్రియ అది. సాహిత్యాన్ని చదివించి చర్చించేటట్టు ఈ సెంటరు చూస్తుంది. 

ఈ రోజుల్లో చాలామంది సంప్రదాయ సంస్కృతవాద నేషనలిజాన్ని ప్రచారం చేస్తుంటే ఇక్కడ ఇంగ్లిష్​ నేషనలిజం నేర్పడానికి గల కారణం ఇంగ్లిష్​  భాషకు  ఉన్న సైన్సు పునాది వల్ల అది సాధ్యమౌతుంది. సంస్కృతం, హిందీ మూఢ నమ్మకాలను నూరిపోసే భాషలు. ఇంగ్లిష్​ అందుకు భిన్నంగా సైన్సును, సైంటిఫిక్ ఆలోచనను పెంచే లక్షణాలుగల భాష. అందుకే పిల్లలు నెలరోజుల్లో  మార్పుకు గురవుతారు. 

టీచింగ్​ టుగెదర్​

ఈ సెంటరు  టీచింగ్ ​ టుగెదర్  అనే ఒక కొత్త టీచింగ్​  విధానాన్ని  ఆచరణ  క్రమంలో కనిపెట్టింది. ఇక్కడ  టీచర్లు  మాటల  బ్యాటింగ్  చేసేవారు. స్టూడెంట్లు సైలెంట్ లిజనర్లు కారు. అందరూ కలిసి పుస్తకం చదువుతుంటారు. కొంతమంది విద్యార్థులు టీచర్లకంటే మంచిగా చదువుతారు. వారికంటే భిన్నంగా అర్థం చేసుకుంటారు. టీచర్లకు టీచ్ చేస్తారు. బడికిపోని కొల్లూరి సత్తయ్య ఇంగ్లిష్​ ఉపన్యాసాలు విని అర్థం చేసుకున్నట్టు ఎక్కువ చదువుకున్న టీచర్లు తక్కువ డిగ్రీ కల విద్యార్థుల నుంచి చర్చల్లో నేర్చుకుంటారు.

 ఇది గురుకులం కాదు అర్థంకాకున్నా బట్టీపట్టడానికి. ఇది నలందా కూడా కాదు. గుండు గీక్కొని మగపిల్లలే బుద్ధిజం నేర్చుకోవడానికి. ఇది సమాజాన్ని  దళితీకరణకు, మానవ సమాన త్యాగానికి బీజాలు వేసే సెంటరు.  నాలుగు సంవత్సరాల్లో 1100 మందికి ఇంగ్లిష్​ జాతీయవాదాన్ని శ్రమ గౌరవంతోపాటు అందించడం. అదీ ఉచితంగా అంత సులభమైన పనికాదు. ఈ సెంటరుకు దాదాపు అన్ని పెద్ద రాష్ట్రాల నుంచి, కొన్ని నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుంచి వచ్చినవారు  తమను తాము మార్చుకున్నారు. అందులో కొంతమంది రాసిన టెస్ట్​మనీలు ఒక పుస్తకంగా ‘లెర్నింగ్ ఇంగ్లిష్​ జాతీయవాదం’ వస్తుంది. కనుక యువత దాన్ని చదివితే ఎంతో మేలు జరుగుతుంది. 

- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్​