తరుగు తీస్తానంటే ఒప్పుకోలేదని కాంటా వేయట్లే

తరుగు తీస్తానంటే ఒప్పుకోలేదని కాంటా వేయట్లే
  • నెలరోజులుగా సెంటర్​లోనే ఓ రైతు పడిగాపులు

మంచిర్యాల, వెలుగు:  కష్టపడి పండించిన ధాన్యాన్ని బస్తాకు 2 కిలోల చొప్పున కోత పెడ్తానంటే ఆ రైతు ఒప్పుకోలే. సర్కారు చెప్పినట్లు ఎలాంటి కోత ​లేకుండా తన వడ్లు కొనాలని డిమాండ్​ చేశాడు. దీంతో సెంటర్​ నిర్వాహకులకు కోపం వచ్చి నెలరోజులుగా వడ్లను కొనకపోవడంతో ఆ రైతు సెంటర్​లోనే పడిగాపులు కాస్తున్నాడు. బాధితుడు చెప్పిన ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూర్​ మండలం సోమన్​పల్లికి చెందిన చందుపట్ల సాగర్​రెడ్డి తనకున్న పదెకరాలతో పాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకుని వరి వేశాడు.  మొత్తం 1100 బస్తాలకు పైగా 400 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొదటి విడత వడ్లను సెంటర్​ ఓపెన్​ చేయకముందే ఏప్రిల్​ 18న సోమన్​పల్లి డీసీఎంఎస్​ సెంటర్​కు తీసుకెళ్లి ఆరబోశాడు. 27న రెండో విడతలో కోసిన వడ్లను సెంటర్​కు తరలించాడు. సెంటర్​ నిర్వాహకులు వడ్లు మంచిగ లేవని బస్తాకు 3 కిలోలు కటింగ్​ పెట్టడంతో సాగర్​రెడ్డి ప్రశ్నించాడు. దీంతో నిర్వాహకులు కక్షగట్టి సీరియల్​ ప్రకారం మూడో నంబర్​ అయినప్పటికీ వడ్లను ఆలస్యంగా కాంటా వేశారు. ఏప్రిల్​ 22న 440 బస్తాలను సమీప రైస్ ​మిల్లుకు తరలించారు. అక్కడ బస్తాకు మరో కిలో నుంచి 2 కిలోలు కట్​ చేస్తామన్నారు. దీనికి ఒప్పుకోకపోవడంతో మిల్లర్లు ఇప్పటికీ ట్రక్​షీట్​ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఇక రెండో విడతలో కోసిన వడ్లను నేటికీ కాంటా పెట్టడం లేదని రైతు సాగర్​రెడ్డి చెప్పాడు. కటింగ్​కు ఒప్పుకోకపోవడంతోనే  మరో 700 బస్తాల వడ్లను కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశాడు.  ఈ విషయమై మంత్రి కేటీఆర్​కు ట్విట్టర్​​ ద్వారా, కలెక్టర్​, అడిషనల్​ కలెక్టర్​ ఆఫీసుల్లో రాతపూర్వకంగా కంప్లైంట్​ చేసినా ఫలితం దక్కలేదన్నాడు. సెంటర్​ నిర్వాహకులు, మిల్లర్లు కలిసి బస్తాకు 8 కిలోల చొప్పున కోత పెడ్తున్నారని, తమకు అనుకూలంగా ఉన్న రైతులవి ముందుగా కాంటా వేస్తున్నారని ఆరోపించాడు.

మిల్లర్లే కోత పెడుతున్నరు..
క్వాలిటీ ఉన్న వడ్లకు సెంటర్​లో ఎలాంటి కోతలు పెట్టడం లేదు. మిల్లర్లు మాత్రం తాలు, తప్ప ఉందని కటింగ్​ పెడుతున్రు. ఒప్పుకోకుంటే వడ్లు దించుకోకుండా ఇబ్బంది పెడుతున్రు. సాగర్​రెడ్డి వడ్లను కాగజ్​నగర్​లోని రైస్​మిల్లుకు పంపించాం. మిల్లర్​ ఇంకా ట్రక్​షీట్​ ఇయ్యలే. ఇది రైతుకు చెప్పాం. మిగిలిన వడ్లను మీకు (డీసీఎంఎస్​ సెంటర్​) ఇయ్య అన్నాడు. అందుకే ఆయన వడ్లను కాంటా వేయలే. సెంటర్​లో కటింగ్​ పెడుతున్నామని, రైతులను ఇబ్బంది పెడుతున్నామని ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు.

- భీమిని వెంకటస్వామి, సెంటర్​ ఇన్​చార్జి