వానాకాలంలో వరే టాప్‌‌‌‌..ఎల్ నినో పరిస్థితులున్నా వెనక్కితగ్గని రైతులు

వానాకాలంలో వరే టాప్‌‌‌‌..ఎల్ నినో పరిస్థితులున్నా వెనక్కితగ్గని రైతులు
  • రాష్ట్రవ్యాప్తంగా 50.93 లక్షల ఎకరాల్లో సాగు
  • 48.22 లక్షల ఎకరాలతో రెండో స్థానంలో పత్తి
  • మొత్తం సాగు విస్తీర్ణంలో ఈ రెండు పంటలే 82.9%
  • 20.41 లక్షల ఎకరాల్లోనే మిగిలిన పంటలన్నీ
  • ప్రభుత్వానికి వ్యవసాయశాఖ తాజా నివేదిక

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఈ ఏడాది వానాకాలం సాగులో వరి అగ్రస్థానంలో నిలిచింది. ఎల్​నినో నేపథ్యంలో వర్షాలు తక్కువగా పడతాయన్న సంకేతాలు ఉన్నప్పటికీ రైతులు వరి సాగుకే మొగ్గు చూపారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నాటికి కోటీ 19 లక్షల 55 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో ఒక్క వరి సాగు విస్తీర్ణమే 50,92,817 ఎకరాలు. పత్తి 48,21,503 ఎకరాల్లో సాగైంది. అంటే మొత్తం సాగు విస్తీర్ణంలో ఈ రెండు పంటల వాటానే దాదాపు 82.9 శాతం. మిగిలిన అన్ని పంటలను కలిపినా వాటి విస్తీర్ణం 20,41,055 ఎకరాలు మాత్రమే. వానాకాలం సాగుకు సంబంధించి ప్రభుత్వానికి వ్యవసాయశాఖ అందించిన తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ఎల్‌నినో ఎఫెక్ట్ ఉన్నా77 శాతం..

రాష్ట్రంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 65,95,645 ఎకరాలు కాగా.. ఈ సారి ఇప్పటివరకు 50,92,817 ఎకరాల్లో సాగు చేశారు. సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే ఇది 77 శాతం. గత ఏడాది ఇదే సమయానికి 59,05,675 ఎకరాల్లో వరి సాగవగా, ఈసారి సాగు విస్తీర్ణం కాస్త తగ్గింది. ఎల్ నినో ఎఫెక్ట్ ఉన్నప్పటికీ పత్తిని అధిగమించి వరి మొదటి స్థానంలో నిలిచింది.


వరి తర్వాత అత్యధికంగా సాగైన పంట పత్తి. సాధారణంగా పత్తి సాగు విస్తీర్ణం 47,41,541 ఎకరాలు కాగా, ఈసారి 48,21,503 ఎకరాల్లో సాగైంది. సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 102 శాతం నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 45,21,192 ఎకరాల్లో పత్తి సాగు కాగా.. ఈ సారి దాదాపు మూడు లక్షల ఎకరాల మేర పెరిగింది.

పప్పుధాన్యాల్లో పెరుగుదల

పప్పుధాన్యాల సాగు ఈ సారి గణనీయంగా పెరిగింది. మొత్తం 7,79,640 ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగయ్యాయి. సాధారణ విస్తీర్ణం 6,49,397 ఎకరాలతో పోలిస్తే 120 శాతం నమోదైంది. కంది 5,54,337 ఎకరాల్లో, పెసర 1,55,625 ఎకరాల్లో, మినుము 65,096 ఎకరాల్లో సాగయ్యాయి. ఇతర పప్పుధాన్యాలు 3,959 ఎకరాల్లో 
సాగయ్యాయి.

మొక్కజొన్నకు 5.89 లక్షల ఎకరాలు

మొక్కజొన్న సాగు విస్తీర్ణం 5,89,813 ఎకరాలుగా నమోదైంది. సాధారణ విస్తీర్ణం 6,17,787 ఎకరాలతో పోలిస్తే 96 శాతం సాగైంది. జొన్న 34,446 ఎకరాల్లో, చిరుధాన్యాలు 1,904 ఎకరాల్లో సాగయ్యాయి. మొత్తంగా ప్రధాన చిరుధాన్యాల విస్తీర్ణం 6,26,231 ఎకరాలుగా నమోదైంది.

నూనె గింజలు 3.89 లక్షల ఎకరాల్లో సాగు

ఈ సారి నూనె గింజల సాగు మొత్తం విస్తీర్ణం 3,89,519 ఎకరాలకు చేరింది. ఇందులో సోయాబీన్‌‌‌‌దే ప్రధాన వాటా. సోయాబీన్‌‌‌‌ 3,72,400 ఎకరాల్లో సాగైంది. ఆముదం 2,902, వేరుశనగ 13,592, నువ్వులు 407, పొద్దుతిరుగుడు 65 ఎకరాల్లో సాగయ్యాయి. నూనె గింజల సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే ఈ సారి 87 శాతం సాగు నమోదైంది.

నల్గొండ టాప్‌‌‌‌

జిల్లాల వారీగా చూస్తే నల్గొండలో అత్యధికంగా 9,90,532 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత సంగారెడ్డి 7,03,546 ఎకరాలు, ఆదిలాబాద్‌‌‌‌ 5,88,032, నిజామాబాద్‌‌‌‌ 5,46,209, వికారాబాద్‌‌‌‌ 5,09,387, ఖమ్మం 4,63,347 ఎకరాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సాధారణ సాగు విస్తీర్ణంతో పోల్చితే ఆదిలాబాద్‌‌‌‌లో 101 శాతం, ఆసిఫాబాద్‌‌‌‌లో 105 శాతం, నిజామాబాద్‌‌‌‌లో 105 శాతం, కామారెడ్డిలో 103 శాతం నమోదైంది. మరోవైపు వరంగల్‌‌‌‌లో 75 శాతం, వనపర్తిలో 75 శాతం, సూర్యాపేటలో 76 శాతం, ములుగులో 80 శాతం సాగు నమోదైంది.

సాధారణ సాగులో 90 శాతం పూర్తి

రాష్ట్రంలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1,32,38,446 ఎకరాలు కాగా, బుధవారం నాటికి 1,19,55,375 ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. దీంతో సాధారణ సాగులో 90 శాతం నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 1,23,53,363 ఎకరాల్లో సాగు జరగగా.. ఈసారి దాదాపు 3.98 లక్షల ఎకరాల సాగు తక్కువగా నమోదైంది. రాష్ట్రంలో సాగైన ప్రతి పది ఎకరాల్లో దాదాపు ఎనిమిది ఎకరాలు ఈ రెండు పంటలకే కేటాయించడం వ్యవసాయంలో వాటి ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నది.