- 1.90 లక్షల క్వింటాళ్ల వడ్లను దారిమళ్లించిన మిల్లర్లు
- విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులతో వెలుగులోకి
- 14 మిల్లుల్లో భారీగా అక్రమాలు
- మరోసారి బయటపడ్డ మిల్లర్ల అవినీతి బాగోతం
హైదరాబాద్, వెలుగు: రైస్ మిల్లర్ల అక్రమాలు మరోసారి బయటపడ్డాయి. లక్షలాది క్వింటాళ్ల ధాన్యం మాయం చేసినట్లు రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహించిన విజిలెన్స్ దాడులతో స్పష్టమైంది. సివిల్ సప్లయ్స్ ద్వారా రైతుల నుంచి సేకరించిన వడ్లను పక్కదారిపట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పలు మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు.
జనవరి 12న ఏకకాలంలో 19 రైస్ మిల్లులను తనిఖీ చేశారు. దాదాపు 1.90 లక్షల క్వింటాళ్ల ధాన్యం (1.72 లక్షల ధాన్యం బస్తాలు) దారి మళ్లించినట్లు గుర్తించారు. ఈ అక్రమాలతో సివిల్ సప్లయ్స్‌కు రూ.60 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు.
8 బృందాలతో తనిఖీలు
ఈ సోదాల్లో వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ రూరల్, హైదరాబాద్ సిటీ-, నల్గొండ, ఆర్సీ పురానికి చెందిన 8 విజిలెన్స్ బృందాల ఐటీ శాఖ అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, నిజామాబాద్‌తో సహా 9 జిల్లాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
నష్టపరిహారంగా మిల్లుల నుంచి ధాన్యం రికవరీ చేయడం, లైసెన్స్‌ల రద్దు, మిల్లులను బ్లాక్‌లిస్ట్ లో చేర్చడం కోసం సివిల్ సప్లైస్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్ధిదారులకు ధాన్యం సకాలంలో చేరేలా విజిలెన్స్ విభాగం నిరంతర తనిఖీలు కొనసాగిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ఏవైనా అక్రమాలు గమనిస్తే టోల్ ఫ్రీ నంబర్ 14432కు సమాచారం అందించవచ్చని విజిలెన్స్ విభాగం వెల్లడించింది.
కస్టమ్ మిల్లింగ్ రైస్ మళ్లింపు
14 మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) మళ్లింపు, కొరత, దుర్వినియోగం జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. మిగిలిన మరో 5 మిల్లుల్లో రికార్డులు సరిగా లేకపోవడంతో నోటీసులు జారీ చేసి నిఘాలో ఉంచారు. పెద్దపల్లి జిల్లా పూసల గ్రామంలోని జానకీరామ
ఇండస్ట్రీస్‌ను నిబంధనల ఉల్లంఘనల కారణంగా సీజ్ చేశారు.
జిల్లాల వారీగా ధాన్యం మాయమైన వివరాలు ఇవే:
కామారెడ్డి, నిజామాబాద్: రూ.19.73 కోట్ల విలువైన ధాన్యం మాయం
సూర్యాపేట: రూ.19.32 కోట్ల విలువైన వడ్లు గాయబ్
నారాయణపేట: రూ.15.91 కోట్ల విలువైన ధాన్యం అదృశ్యం
పెద్దపల్లి: రూ.11.38 కోట్ల విలువైన కొరత
మహబూబాబాద్: రూ.4.86 కోట్ల విలువైన మళ్లింపు
రంగారెడ్డి: రూ.88లక్షల విలువైన సీఎంఆర్ స్టాక్ మళ్లింపు
