- 131 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం
- రాష్ట్రం నుంచి సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో జీ చంద్రమౌళి, బాల సుబ్రమణియన్,
- కుమారస్వామికి పద్మశ్రీ.. వైద్య రంగంలో గూడురు వెంకటరావు, విజయ్ ఆనంద్ రెడ్డికి
- కళారంగంలో దీపికారెడ్డి, పశుపోషణలో రామారెడ్డి మామిడికి దక్కిన పురస్కారం
- సినీ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం దేశ రెండో అత్యున్నత పురస్కారం
- ప్రముఖ డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మ భూషణ్.. ఏపీకి 4 పద్మశ్రీలు
న్యూఢిల్లీ, వెలుగు: 2026కు గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణ పంట పండింది. 77 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విడుదల చేసిన జాబితాలో వివిధ రంగాల్లో సేవలందించిన తెలంగాణకు చెందిన ఏడుగురికి పద్మ శ్రీ పురస్కారాలు దక్కాయి. సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో జీ చంద్రమౌళి, బాల సుబ్రమణియన్, కుమారస్వామి తంగరాజ్‌కు పద్మ శ్రీ దక్కింది. అలాగే, వైద్య రంగంలో గూడురు వెంకటరావు, విజయ్ ఆనంద్‌రెడ్డి, కళా రంగంలో దీపికారెడ్డి, పశుపోషణ/వ్యవసాయంలో రామారెడ్డి మామిడిని పురస్కారం వరించింది.
పద్మ పురస్కారాలు– 2026 జాబితాను కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర-సాంకేతికం, వాణిజ్యం–-పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం–- విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ రంగాల నుంచి ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. మొత్తం 131 పద్మ అవార్డుల్లో రెండు సంయుక్తంగా ప్రకటించింది. తెలంగాణ నుంచి ఏడుగురు, ఏపీ నుంచి నలుగురు పురస్కారం దక్కినవారిలో ఉన్నారు. అలాగే 19 మంది మహిళలకు, విదేశీ విభాగంలో ఆరుగురికి, మరణానంతరం16 మందికి ప్రకటించినట్లు కేంద్రం వెల్లడించింది. సాధారణంగా ప్రతి ఏటా మార్చ్/ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే వేడుకల్లో ఈ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు.
కేరళ నుంచి ముగ్గురికి పద్మ విభూషణ్, ఇద్దరికి పద్మ భూషణ్..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేరళకు అత్యధికంగా పద్మ అవార్డులు దక్కాయి.
మొత్తం ఐదు పద్మ విభూషణ్ పురస్కారాల్లో ముగ్గురు, 13 పద్మ భూషణ్ పురస్కారాల్లో ఇద్దరు కేరళకు చెందిన వారే ఉన్నారు. పబ్లిక్ అఫైర్స్‌లో సీపీఎం నేత, మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్‌కు (మరణానంతరం), సామాజిక సేవలో కె.టి. థామస్, సాహిత్యం– విద్యలో పీ నారాయణకు పద్మ విభూషణ్ దక్కింది. అలాగే, కళారంగంలో మరణాంతరం సినీ నటుడు ధర్మేంద్ర (మహారాష్ట్ర), కళా రంగంలో ఎన్. రాజం(యూపీ)కి ఈ రెండో అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చింది. జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్, బీజేపీ నాయకుడు వీకే మల్హోత్రా (మరణానంతరం), నేపథ్య గాయని అల్కా యాజ్ఞిక్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం భగత్ సింగ్ కోష్యారీ, నటుడు మమ్ముట్టి (కేరళ), వెల్లప్పల్లి నటేశన్ (కేరళ), బ్యాంకర్ ఉదయ్ కోటక్ (మహారాష్ట్ర)కు పద్మభూషణ్ అవార్డులు ప్రకటించింది. అలాగే, అమెరికా నుంచి ప్రముఖ దంత వైద్యుడు నోరి దత్తాత్రేయుడు, క్రీడా రంగంలో విజయ్ అమృత్‌రాజ్‌ను మూడో అత్యున్నత పురస్కారం వరించింది. ఇటీవల దేశానికి మహిళా ప్రపంచ కప్‌ను సాధించిపెట్టిన భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, క్రికెటర్ రోహిత్ శర్మ, నటులు ఆర్. మాధవన్, ప్రోసెంజిత్ ఛటర్జీకి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
తెలంగాణ ‘పద్మా’ లు వీరే..
జి.చంద్ర మౌళి (సైన్స్ అండ్ ఇంజినీరింగ్)
కృష్ణ మూర్తి బాల సుబ్రమణియన్
(సైన్స్ అండ్ ఇంజినీరింగ్)
కుమారస్వామి తంగరాజ్
(సైన్స్ అండ్ ఇంజినీరింగ్)
గూడూరు వెంకటరావు (వైద్యం)
పాలకొండ విజయ్ ఆనంద్‌రెడ్డి (వైద్యం)
దీపికారెడ్డి (కళ)
రామారెడ్డి మామిడి (పశుపోషణ/వ్యవసాయం)
ఏపీ నుంచి...
మాగంటి మురళీ మోహన్ (కళలు)
గద్దె రాజేంద్రప్రసాద్ (కళలు)
గరిమెళ్ల బాల కృష్ణప్రసాద్ (కళలు)
వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం – విద్య)
అంకాలజీలో మేటి నిపుణుడువిజయ్ ఆనంద్‌రెడ్డి
పాలకొండ విజయ్ ఆనంద్‌రెడ్డి దేశంలోనే ప్రముఖ అంకాలజిస్ట్. రేడియేషన్ అంకాలజీలో అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేసి, అధునాతన చికిత్స పద్ధతులను అందుబాటులోకి తెచ్చారు. క్యాన్సర్ నివారణ చికిత్సలో ఆయన ఎక్స్‌పర్ట్. ప్రస్తుతతం హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో క్యాన్సర్ విభాగానికి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో, లక్షలాది మంది రోగులకు సరైన చికిత్స అందించడంలోకీలక పాత్ర పోషించారు.
టెక్నాలజీ వారధి బాలసుబ్రమణియన్
శాస్త్ర సాంకేతిక రంగం అంటే కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాదని, అది సామాన్యుడి జీవితాన్ని మెరుగుపరచాలని నమ్మే వ్యక్తి కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్. ఇంజినీరింగ్ రంగంలో ఆయన చేసిన వినూత్న పరిశోధనలకు గుర్తింపుగా పద్మ శ్రీ వరించింది. ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో దేశీయ సాంకేతికతను బలోపేతం చేయడంలో ఆయన అగ్రభాగాన నిలిచారు. విదేశీ టెక్నాలజీపై ఆధారపడటాన్ని తగ్గించేలా అనేక పరిశోధనలు చేశారు.ఇంజనీరింగ్ ప్రక్రియల్లో సంక్లిష్టతను తగ్గించి, ఉత్పాదకతను పెంచే కొత్త పద్ధతులను ఆవిష్కరించారు. ఇవి పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీశాయి.
జన్యు వైవిధ్య పరిశోధకుడు డాక్టర్ తంగరాజ్
డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ( సీసీఎంబీ)లో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. జన్యు సంబంధిత పరిశోధనల్లో ఆయన ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. భారతీయ జనాభా జన్యు వైవిధ్యంపై ఆయన చేసిన లోతైన అధ్యయనాలు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. దక్షిణ ఆసియా ప్రజల పూర్వీకుల మూలాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల నిర్ధారణలో తంగరాజ్ చేసిన కృషికి గానూ పద్మశ్రీ పురస్కారం లభించింది. ప్రస్తుతం ఆయన సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్స్(సీడీఎఫ్‌డీ) డైరెక్టర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కూచిపూడి నృత్య కిరణం దీపికారెడ్డి..
దీపికారెడ్డి ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి. భారతీయ సంస్కృతిని, కూచిపూడి నృత్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. దీపికారెడ్డి గత ఐదు దశాబ్దాలుగా కూచిపూడి నృత్య రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు. ఆమె కేవలం నృత్యకారిణిగానే కాకుండా, కొరియోగ్రాఫర్‌గా, గురువుగా అంతర్జాతీయ గుర్తింపుపొందారు. ఆమె తన 6వ ఏట నుంచే నృత్య సాధన ప్రారంభించారు. తొలుత సుమతీ కౌశల్ వద్ద, ఆ తర్వాత ప్రఖ్యాత గురువు పద్మభూషణ్ వెంపటి చినసత్యం శిష్యరికంలో కూచిపూడి నైపుణ్యాలను అభ్యసించారు. జర్మనీ, రష్యా, జపాన్, ఫ్రాన్స్, శ్రీలంకలాంటి అనేక దేశాల్లో భారత సాంస్కృతిక రాయబారిగా ప్రదర్శనలు ఇచ్చారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు (2017), ఏపీ ప్రభుత్వం నుంచి కళారత్న / హంస అవార్డు (2007) అవార్డు అందుకున్నారు.
పశుపోషణలో మేటి రామారెడ్డి
రామారెడ్డి మామిడి.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బ్లాక్‌లోని శంషాబాద్ గ్రామానికి చెందిన ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి భోజ్‌రెడ్డి ఓ భూస్వామి.. కానీ ఇందిరా సేవా సదన్ కింద అనేక విద్యా సంస్థలను ప్రోత్సహించారు. 1970ల మధ్యలో ప్రస్తుత హనుమకొండ జిల్లాలోని ములుకనూరు కో-ఆపరేటివ్ రూరల్ బ్యాంకును సందర్శించి, ములుకనూ రు కో- ఆపరేటివ్ అధ్యక్షుడు ఏకే విశ్వనాథ్ రెడ్డితో మా ట్లాడిన తర్వాత సహకార రంగం, పాడి పశుపోషణలో రామారెడ్డి పని ప్రారంభమైంది. ఆ టైమ్‌లో రాజేంద్రనగర్ బ్లాక్ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన తన బ్లాక్‌లోని 15 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ములుకనూరులాగా అభివృద్ధి చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించ డంలో, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పాలను సేకరించడంలో కీలక పాత్ర పోషించారు. మిల్క్ యూనియన్ల బలోపేతానికి ఆయన తన జీవితాంతం కృషి చేశారు. 2025 అక్టోబర్ 27న కన్నుమూశారు.
ఆకాశ్ క్షిపణి అభివృద్ధిలో చంద్రమౌళిది కీలక పాత్ర
డీఆర్డీవో మాజీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి 1959 అక్టోబర్‌లో ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో జన్మించారు. ఆయన వరంగల్ ఎన్ఐటీ (రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ) నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్, ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2021లో ఉస్మా నియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పొందారు. 1983లో డీఆర్‌డీఎల్ ప్రాజెక్ట్ అయిన ఆకాశ్ గ్రూప్‌లో చేరడానికి ముందు ఆయన రెండేండ్లు ప్రైవేట్ పరిశ్రమలో పనిచేశారు. తన 34 ఏండ్ల కెరీర్‌లో ఆకాశ్ క్షిపణి అభివృద్ధి కోసమే పనిచేశారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ పై జరిపిన దాడిలో ఈ మిసైల్స్ కీలక పాత్ర పోషించాయి.
గ్యాస్ట్రో ఎంటరాలజీ దిగ్గజం గూడూరు వెంకట్రావు
డాక్టర్ గూడూరు వెంకట్రావు (జీవీ) ఒక ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ (జీఐ) సర్జన్. ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఉస్మానియా మెడికల్ కాలేజీలాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో విద్యనభ్యసించి, అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాన్ని సాధించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రముఖ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ హాస్పిటల్స్) లో డైరెక్టర్‌గా, చీఫ్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మినిమల్ యాక్సెస్ అండ్ హెచ్‌పీబీ సర్జరీ హెచ్‌వోడీగా పనిచేస్తున్నారు.
గ్యాస్ట్రోఎంటరాలజీలో శస్త్రచికిత్స విభాగంలో ఆయనకు 30 ఏండ్లకు పైగా అనుభవం ఉంది. ముఖ్యంగా లాపరోస్కోపిక్ (కీ హోల్) సర్జరీలో ఆయన ప్రపంచస్థాయి నిపుణుడు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో లాపరోస్కోపిక్ సర్జరీలు చేసిన బృందాల్లో గూడూరు ఒకరు. వైద్య రంగంలో అనేక ఆవిష్కరణలు చేశారు. ఆయన పేరు మీద సుమారు 200కు పైగా ఇంటర్నేషనల్ సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి.
