అడ్వైజర్ల వ్యవస్థ రద్దు చేయాలి..కేసీఆర్​కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

అడ్వైజర్ల వ్యవస్థ రద్దు చేయాలి..కేసీఆర్​కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారులుగా 12 మంది ఉన్నారని, వీరంతా ఉన్నత స్థాయిలో పనిచేసి రిటైర్ అయిన వారే అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి అన్నారు. వీరిలో చాలా మందికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చారని, ఒక్కో అడ్వైజర్​పై నెలకు రూ.50లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అడ్వైజర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీఎం కేసీఆర్​కు పద్మనాభ రెడ్డి లెటర్ రాశారు.

ఉన్నత స్థాయిలో పనిచేసి రిటైర్ అయిన వారిని మళ్లీ అడ్వైజర్లుగా నియమించడం ప్రభుత్వ ఉద్యోగులకు తప్పుడు సంకేతం ఇచ్చినట్లు అవుతుందని లెటర్​లో పేర్కొన్నారు. ‘‘మాకు విధేయులుగా ఉంటే రిటైర్ అయిన తర్వాత కేబినెట్ ర్యాంక్​తో అడ్వైజర్లుగా తీసుకుంటాం”అని హామీ ఇస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొందరిని మాత్రమే మినహాయించి చాలా మంది సీఎస్​లు, డీజీపీలను అడ్వైజర్లుగా నియమించారని ఆయన గుర్తు చేశారు.

జీవో 55ని అమలు చేయాలి

2015, మే 5న జీవో 55 ప్రకారం రిటైర్ అయిన ఉద్యోగులను ఓఎస్డీలుగా తీసుకోవద్దనే ఆదేశాలు ఉన్నాయని పద్మనాభ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఏపీలో పెద్ద ఎత్తున అడ్వైజర్లను నియమించడంపై అక్కడి హైకోర్టులో పిటిషన్ దాఖలైందని తెలిపారు. విచారణ సందర్భంగా ‘‘ఇలా అడ్వైజర్లను నియమిస్తూ పోతే కలెక్టర్లు, తహశీల్దార్లకు కూడా అడ్వైజర్లు ఉంటారు”అని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. ప్రజలకు విధేయులుగా ఉండాల్సిన అధికారులు రూలింగ్​ పార్టీకి విధేయులుగా ఉండటంతో పాలనపై ప్రభావం చూపిస్తుందన్నారు.

చట్టబద్ధ పాలన, అవినీతి నిర్మూలన సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. వివిధ రంగాల్లో ప్రతిభ ఉన్న సైం టిస్టులు, ఫైనాన్స్​ నిపుణులను అడ్వైజర్లుగా నియమి స్తే ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. అంతే గానీ, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను అడ్వైజర్లుగా నియమించడం కరెక్ట్​ కాదన్నారు. రిటైర్ అయిన అధికారులకు పాలనా యంత్రాంగాన్ని పునరావాస కేంద్రాలుగా మార్చొద్దని లేఖలో కోరారు.