
- ముగ్గురు అరెస్ట్ఆభరణాలు, ఫోన్ రికవరీ
పద్మారావునగర్, వెలుగు: వారాసిగూడ పీఎస్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బాధితురాలి మేనకోడలే ప్రధాన నిందితురాలని తేల్చారు. ఆదివారం సాయంత్రం వారాసిగూడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్జోన్డీసీపీ బాలస్వామి వివరాలు వెల్లడించారు. పార్సీగుట్టలో పారిజాతం(60) అనే మహిళ అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. అదే ఇంట్లో మరో గది ఖాళీగా ఉండటంతో యజమాని టులెట్బోర్డు పెట్టారు. ఈ నెల 2న మధ్యాహ్నం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, ఇల్లు అద్దెకు కావాలంటూ పారిజాతం గదిలోకి వచ్చారు. ఆమెను కుర్చీలో కట్టేసి, నోటికి బ్యాండేజీ వేసి, కత్తులతో బెదిరించారు.
తర్వాత 3 తులాల ఆభరణాలు, ఒక ఫోన్ ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఎల్ల జ్యోతి(45), ఎలగరి శ్రీకాంత్(26), కొర్రోలు ఈశ్వర్(19)ను నిందితులుగా గుర్తించారు. ఆదివారం వారిని అరెస్ట్ చేశారు. జ్యోతి పారిజాతానికి మేనకోడలు. తనకు పరిచయం ఉన్న శ్రీకాంత్ కు తన మేనత్త ఒక్కరే ఇంట్లో ఉంటారని, నగలు కాజేయొచ్చని చెప్పి, స్కెచ్ వేసింది. ఆమె సలహాతో శ్రీకాంత్ తన ఫ్రెండ్ఈశ్వర్ ను వెంట తీసుకెళ్లి, చోరీకి పాల్పడినట్లు విచారణలో చెప్పారు.
వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించిన ఏసీపీ జైపాల్ రెడ్డి, సీఐ రమేశ్ గౌడ్, ఎస్ఐలు సుధాకర్, ప్రకాశ్‌రెడ్డి, కానిస్టేబుళ్లు ఎండీ.గాలేబ్, ఎండీ.దస్తగిరి, ఎస్.వేణు, బి.రామకృష్ణ, ఎ.దేవేందర్ నాయక్, జి.రజిత, వినయ్, గణేశ్, కృష్ణను డీసీపీ అభినందించి, రివార్డులు అందజేశారు.