సింధు జలాలపై దృఢంగా భారత్.. 'దుష్ట కుట్ర' అంటూ షెహబాజ్ షరీఫ్ నిస్సహాయత!

సింధు జలాలపై దృఢంగా భారత్.. 'దుష్ట కుట్ర' అంటూ షెహబాజ్ షరీఫ్ నిస్సహాయత!

Indus Water Treaty: పెహల్గామ్ దాడి తర్వాత భారత్ సింధు జలాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కి బుద్ధి చెప్పేందుకు నీటిని భారత్ కొత్త ఆయుధంగా మార్చుకుంది. అయితే దీనిని పునరుద్ధరించాలని పదేపదే పాక్ లేఖలు రాస్తూ ప్రాధేయపడుతున్నప్పటికీ మోదీ సర్కార్ దీనిపై దృఢంగా ముందుకు సాగుతోంది. 

వాస్తవానికి ఏప్రిల్ నుంచి సింధు జలాలను నిలిపివేయాలని భారత్ నిర్ణయించిన తర్వాత పాక్ ప్రజల నుంచి అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. తాగు సాగు అవసరాల కోసం నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్ ప్రజలు ప్రభుత్వంపై తిరగపడే పరిస్థితులు వచ్చాయి. ఇంత జరుగుతున్నా పాకిస్థాన్ మాత్రం తాము ఉగ్రవాదాన్ని వీడతాం, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించటం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించం వంటి ప్రకటన కానీ లేదా ఆ దిశగా చర్యలు కానీ లేకపోవటంతో భారత్ కూడా కఠినంగానే కొనసాగుతోంది. అయితే పాక్ ప్రధాని మాత్రం భారతదేశానికి ఇలా ఏకపక్షంగా వ్యవహరించే అధికారం లేదంటూ ఇది న్యూఢిల్లీ 'దుష్ట కుట్ర' అంటూ అభివర్ణించారు. 

దీనిపై మంగళవారం పాక్ ప్రధాని హెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ బారత్ నీటిని ఆయుధంగా మార్చిన క్రమంలో దానిని ఎదుర్కోవటానికి తమ దేశంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అత్యవసర చర్యలు తీసుకురావాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. నీటి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవటంతో నిస్సహాయతను అక్కడి నాయకుల్లో పెంచుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్ భారత దృధ నిర్ణయంతో భయాందోళనతో ప్రతిస్పందిస్తోందని నిపుణులు చెబుతున్నారు. 

వాస్తవానికి ఇండియా పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం 1960లో కుదిరింది. దీని ప్రకారం సింధూ బేసిన్ నదులపై నియంత్రణను కేటాయిస్తుంది. భారతదేశానికి తూర్పు నదులు, పాకిస్తాన్‌కు పశ్చిమ నదుల నుంచి ఎక్కువ నీటిని మంజూరు చేశారు.