చెలరేగిన బౌలర్లు..పాక్ 147 ఆలౌట్

చెలరేగిన బౌలర్లు..పాక్ 147 ఆలౌట్

దాయాదితో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థి పాక్ను ముప్పుతిప్పలు పెట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147  పరుగులకే ఆలౌట్ అయింది. 

ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ను భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో భారత బౌలర్లు కట్టడి చేశారు.  పాక్  కెప్టెన్ బాబర్ ఆజమ్ 15 పరుగుల వద్దే ఔటయ్యాడు.  ఆ తర్వాత వన్ డౌన్లో వచ్చిన ఫకర్ జమాన్ 10 పరుగులే చేసి పెవీలియన్ బాటపట్టాడు. అజమ్ను భువీ బుట్టలో వేసుకోగా..ఫకర్ జమాన్ను ఆవేశ్ ఖాన్ పెవీలియన్ చేర్చాడు. ఈ సమయంలో హార్థిక్ పాండ్యా తన బౌలింగ్ మ్యాజిక్ను చూపించాడు. ఇఫ్తికర్  అహ్మద్తో పాటు ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్ రిజ్వాన్ను ఔట్ చేసి భారత్కు అదిరిపోయే బ్రేక్ ఇచ్చాడు. అనంతరం స్వల్ప వ్యవధిలో  కుష్దిల్ షాను కూడా హార్థిక్ ఔట్ చేయడంతో  పాక్ 97 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది.

ఏ దశలోనూ కోలుకోలేదు..
భారత బౌలర్ల ధాటికి పాక్ వరుసగా వికెట్లను కోల్పోవడంతో..దాయాది ఏ దశలోనూ కోలుకోలేదు. ముఖ్యంగా ఓపెనర్ రిజ్వాన్ ఔట్ అయిన తర్వాత పాకిస్థాన్ వరుసగా వికెట్లను కోల్పోయింది. కుష్దిల్ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్ ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆసిఫ్ ను భువీ ఔట్ చేయగా..నవాజ్ వికెట్ను  అర్ష్ దీప్ పడగొట్టాడు. దీంతో పాకిస్థాన్ 114 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.  షాదాబ్ ఖాన్  ఓ ఫోర్ కొట్టి ఊపుమీదున్నట్లు కనిపించినా..ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. 10 పరుగులు చేసిన అతను.. భువనేశ్వర్ బౌలింగ్లో వెనుదిరిగాడు.   ఆ తర్వాత వచ్చిన నదీష్ షాను కూడా భువీ ఔట్ చేసి..నాల్గో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

చివర్లో సిక్సులతో రెచ్చిపోయిన నషీమ్ షాను అర్ష్ దీప్ సింగ్ బౌల్డ్ చేయడంతో.. పాక్ 19.5  ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది.