ఇండియాతో గొడవలకు చర్చలతో పరిష్కారం

ఇండియాతో గొడవలకు చర్చలతో పరిష్కారం

ఇస్లామాబాద్: ఇండియాతో ఉన్న అన్ని వివాదాలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, జనరల్ ఖమర్ జావేద్ బజ్వా అన్నారు. కాశ్మీర్ సహా ఎప్పటి నుంచో పెండింగ్‌‌‌‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునే విషయంలో దౌత్య మార్గాన్ని తాము నమ్ముతూనే ఉంటామని తెలిపారు. ‘ఇస్లామాబాద్ సెక్యూరిటీ డైలాగ్’ కాన్ఫరెన్స్‌‌‌‌ చివరి రోజైన శనివారం బజ్వా మాట్లాడారు. ‘‘ప్రపంచంలోని మూడింట ఒక వంతు మంది ఏదో ఒక ఘర్షణ, యుద్ధంలో పాల్గొంటున్నారు. అందుకే అగ్ని జ్వాలలను మన రీజియన్‌‌‌‌ నుంచి దూరంగా ఉంచడం చాలా ముఖ్యం’’ అని వివరించారు. ‘‘కాశ్మీర్ వివాదంతో సహా అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు చర్చలు, దౌత్యాన్ని ఉపయోగించాలని పాకిస్తాన్ విశ్వసిస్తోంది. ఇండియా అంగీకరిస్తే ఈ విషయంలో ముందుకు సాగడానికి మేం సిద్ధం’’ అని తెలిపారు. కానీ ఇండియన్ లీడర్ల మొండి వైఖరి అడ్డంకిగా మారిందన్నారు. కాగా, ఇండియా ప్రమాదవశాత్తు మిసైల్‌‌‌‌ను ప్రయోగించడం వల్ల.. భారీ స్థాయి ఆయుధ వ్యవస్థలను నిర్వహించగల సామర్థ్యం ఆ దేశానికి ఉందా అనే దానిపై అనుమానాలు వస్తున్నాయన్నారు. ఎల్‌‌‌‌ఓసీ వెంబడి ప్రస్తుత పరిస్థితి సంతృప్తికరంగా, చాలా ప్రశాంతంగా ఉందని చెప్పారు. 

క్యాంపు రాజకీయాలను నమ్మబోం

అమెరికాతో తమకు సుదీర్ఘమైన, అద్భుతమైన వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని బజ్వా చెప్పారు. తాము క్యాంపు రాజకీయాలను నమ్మబోమని చెప్పా రు. ఒకదేశంతో సంబంధాలను పణంగా పెట్టి ఇంకో దేశంతో స్నేహం కొనసాగించబోమన్నారు.