
- మరో 50 మందికి పైగా గాయాలు.. ఇండ్లు, వాహనాలు ధ్వంసం
- భయాందోళనలో కాశ్మీర్ సరిహద్దు ప్రాంత నివాసులు
శ్రీనగర్: జమ్మూ-కాశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వీసీ) వెంబడి ఉన్న గ్రామాలపై పాకిస్తాన్ ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి దాటాక కాల్పులు జరిపింది. భారీ ఆర్టిలరీ, మోర్టార్ షెల్లింగ్‌తో విచక్షణా రహితంగా దాడి చేసింది. ఈ దాడుల్లో నలుగురు చిన్నారులతో సహా 13 మంది భారత పౌరులు మరణించారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత భద్రతా దళాలు మిస్సైళ్ల దాడులు చేసిన కొద్దిసేపటికే పాక్ ఆర్మీ ఎల్వోసీ వెంబడి దాడులకు దిగింది.
ప్రధానంగా పూంచ్ జిల్లాలోని బాలాకోట్, మెంధర్, మన్‌కోట్, కృష్ణ ఘాటి, గుల్పూర్, కెర్ని, పూంచ్ జిల్లా ప్రధాన కార్యాలయం వరకు దాడులు జరిగాయి. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌లో, రాజౌరి జిల్లాలో, కుప్వారా జిల్లాలోని కర్నాహ్ సెక్టార్‌లోని పలు ప్రాంతాల్లో పాక్ ఆర్మీ అటాక్ చేసింది. ఈ దాడుల్లో 13 మంది భారత పౌరులు చనిపోవడంతోపాటు డజన్ల కొద్దీ ఇండ్లు, వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించడంలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మంగళవారం అర్ధరాత్రి దాటాకా పాకిస్తాన్ ఆర్మీ ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులు, ఆర్టిలరీ షెల్లింగ్‌కు పాల్పడినట్లు భారత రక్షణ శాఖ ప్రతినిధి బుధవారం వెల్లడించారు. పాక్ సైన్యం దాడులకు భారత సైన్యం దీటుగా బదులిస్తున్నదని తెలిపారు. ఇండియన్ ఆర్మీ జరిపిన దాడుల్లో శత్రు దళాలకు భారీ నష్టం వాటిల్లినట్లు వివరించారు. ఎల్వోసీ వెంబటి పాక్ ఆర్మీ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నదని ఆరోపించారు. పాక్ చర్యలకు భారత సైన్యం సంయమనంతో తగిన విధంగా ప్రతిస్పందిస్తోందని అధికారులు పేర్కొన్నారు.
బంకర్లలోకి ఎల్వోసీ ప్రాంత ప్రజలు
లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాక్ సైన్యం జరుపుతున్న కాల్పులకు కాశ్మీర్ సరిహద్దు ప్రాంత నివాసులు భయందోళనకు గురవుతున్నారు. అర్ధరాత్రివేళ ప్రజలంతా తమ ఇండ్లను వదిలి భూగర్భ బంకర్లలో ఆశ్రయం పొందారు. రాత్రంతా బంకర్లలోనే భయం భయంగా గడిపారు.