అఫ్గాన్ పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్.. 70 మంది మృతి

అఫ్గాన్ పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్.. 70 మంది మృతి
  • అనేక మందికి గాయాలు.. నంగర్హార్, పాక్టికా ప్రావిన్సులలో దాడులు   

ఇస్లామాబాద్: టెర్రరిస్టులే లక్ష్యంగా పాకిస్తాన్, -అఫ్గానిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని నివాస ప్రాంతాలపై పాకిస్తాన్ వైమానిక దళం (పీఏఎఫ్) దాడులకు పాల్పడింది. ఈ దాడులలో 70 మంది అఫ్గన్ పౌరులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ అంశాన్ని అఫ్గన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఎక్స్​లో ఒక పోస్ట్‌‌‌‌‌‌‌‌లో తెలిపారు. ‘‘శనివారం రాత్రి నంగర్హార్, పాక్టికా ప్రావిన్సులలో పాకిస్తాన్ బాంబు దాడులకు పాల్పడింది. 

ఈ దాడులలో మహిళలు, పిల్లలతో సహా చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు’’ అని ఆయన తెలిపారు. కాగా, ఇస్లామాబాద్​లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడులకు కారణమైన అఫ్గన్ టెర్రరిస్ట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు పాల్పడినట్టు పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ ఎక్స్​లో పోస్ట్​చేశారు. పాకిస్తాన్ నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. సరిహద్దు ప్రాంతంలోని పాకిస్తానీ తాలిబన్, దాని అనుబంధ సంస్థలకు చెందిన ఏడు ఉగ్రవాద శిబిరాలు, రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ప్రతీకార దాడులకు పాల్పడినట్టు ఆయన అన్నారు. 

ఇటీవల ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఒక మసీదుపై దాడికి పాల్పడిన ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అనుబంధ సంస్థపై దాడిచేసినట్టు చెప్పారు. ఇటీవల మసీదుపై ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అనుబంధ సంస్థ జరిపిన దాడిలో 31 మంది మరణించారు. 160 మందికి పైగా గాయపడ్డారు. 2008 మారియట్ హోటల్ బాంబు దాడి తర్వాత ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌పై జరిగిన అత్యంత ఘోరమైన దాడులలో ఇది ఒకటి.