
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్ లో పర్యటించనున్నారు. గోవా వేదికగా మరో రెండు వారాల్లో జరగబోయే షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో పాల్గొనేందుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగశాఖ వెల్లడించింది. ఇదే అంశంపై భారత ప్రభుత్వం మూడు నెలల క్రితమే దాయాది దేశానికి ఆహ్వానం పంపింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్. జైశంకర్.. పాక్ విదేశాంగ మంత్రికి అధికారికంగా ఆహ్వానం పంపినట్లు సమాచారం.
ఉగ్రవాదం, కశ్మీర్ వంటి అంశాలపై భారత్, పాకిస్తాన్ మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఇది కీలక పరిణామం అని చెప్పొచ్చు. చాలా ఏళ్ల తర్వాత పాకిస్తాన్ లో కీలక పదవుల్లో ఉన్నవారు భారత్‌కు రావడం ఇదే తొలిసారి. చివరిసారి 2014లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ పర్యటించగా.. ఈ తరువాత పాకిస్తాన్ నుంచి భారత్‌లో అడుగుపెట్టే మొదటి నేత బిలావల్ భుట్టోనే కానుండటం విశేషం.
గతేడాది సెప్టెంబరులో షాంఘై సదస్సుకు అధ్యక్ష బాధ్యతలు అందుకున్న భారత్.. మంత్రుల స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మే 4-, 5 తేదీల్లో గోవా వేదికగా విదేశాంగ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు భారత్.. ఇటీవల ఎస్‌సీఓ (SCO) సభ్య దేశాలకు ఆహ్వానాలు పంపింది. సభ్యదేశాలైన చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలతో పాటు పాకిస్తాన్ కు కూడా ఈ ఆహ్వానం పంపినట్లు సమాచారం.