352 మంది తాలిబాన్లను హతమార్చాం..మద్దతిస్తున్న టెర్రరిస్టులనూ మట్టుబెట్టినం: పాక్

352 మంది తాలిబాన్లను హతమార్చాం..మద్దతిస్తున్న టెర్రరిస్టులనూ మట్టుబెట్టినం: పాక్
  • పాక్ కావాలా లేక టెర్రరిస్టులా తేల్చుకొమ్మని అఫ్గాన్​కు హెచ్చరిక

ఇస్లామాబాద్: టెర్రరిస్టులతో అంటకాగుతూ సరిహద్దుల్లో హింసకు పాల్పడుతున్న అఫ్గానిస్తాన్ బలగాలపై దాడులు తీవ్రతరం చేసినట్లు పాకిస్తాన్ వెల్లడించింది. ‘ఆపరేషన్ ఘజబ్ లిల్  హక్’ పేరుతో ప్రతిదాడులు చేస్తూ 352 మంది అఫ్గాన్  తాలిబాన్లు, వారికి మద్దతుగా నిలిచిన టెర్రరిస్టులను మట్టుబెట్టామని పాకిస్తాన్  తెలిపింది. తమ దాడుల్లో 500 మంది గాయపడ్డారని పాక్ సమాచార మంత్రి అతలుల్లా తరార్  వెల్లడించారు. శనివారం ఇస్లామాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడారు.

104 మిలిటరీ పోస్టులు, 163 ట్యాంకులను ధ్వంసం చేశామని, 22 సరిహద్దు పోస్టులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అలాగే, 37 చోట్ల వైమానిక దాడులు నిర్వహించామని చెప్పారు. అఫ్గాన్  కూడా 53 చోట్ల దాడులు చేసిందని వెల్లడించారు. అంతకుముందు ఆర్మీ ప్రతినిధి, లెఫ్టినెంట్  జనరల్  అహ్మద్  షరీఫ్​ చౌధరి మాట్లాడుతూ అఫ్గానిస్తాన్​కు పాకిస్తాన్  కావాల్నో, టెర్రరిస్టు సంస్థలు కావాల్నో తేల్చుకోవాలన్నారు. ‘‘గత కొద్ది రోజులుగా మా దేశం చెబుతున్నదే నేనూ చెబుతున్నాను. 

అఫ్గాన్  ముందు పాక్, బలూచ్  లిబరేషన్ ఆర్మీ, అల్ కాయిదా, టెర్రరిస్టులు, టెర్రరిస్టు సంస్థలు ఉన్నాయి. వారికి ఎవరు కావాలో వారే ఎంపిక చేసుకోవాలి. పాక్​తో ఉంటారా లేక టెర్రరిస్టులతో ఉంటారా అన్నది వారి ఇష్టం” అని అహ్మద్  వ్యాఖ్యానించారు. మరోవైపు ఆపరేషన్  ఘజబ్ లిల్ హక్​కు అమెరికా మద్దతు తెలిపింది. తన భూభాగాన్ని కాపాడుకునే హక్కు పాకిస్తాన్​కు ఉందని అమెరికా రాజకీయ వ్యవహారాల సహాయ మంత్రి అలిసన్  హూకర్  పేర్కొన్నారు. కాగా.. అఫ్గాన్  భూభాగాన్ని తమకు వ్యతిరేకంగా టెర్రరిస్టు సంస్థలు వాడుకునేందుకు తాలిబాన్లు అనుమతిస్తున్నారని పాక్ ఆరోపిస్తున్నది. అయితే, ఆ ఆరోపణలను అఫ్గాన్  తాలిబాన్లు ఖండించారు.

పాక్​తో చర్చలకు ఓకే: అఫ్గాన్ తాలిబాన్లు

పాక్, అఫ్గాన్  మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు సుముఖంగా ఉన్నామని అఫ్గాన్ తాలిబాన్లు తెలిపారు. ఈ విషయంపై పాక్​తో సంప్రదింపులు జరుపుతామని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్  ముత్తాకి.. ఖతార్  విదేశాంగ మంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ ఖలీఫీకి ఫోన్​లో చెప్పారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నామని తాలిబాన్  ప్రతినిధి జబీనుల్లా ముజాహిద్  చెప్పారు.