
ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్.. ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారీ హైప్ తో మ్యాచ్ స్టార్ట్.. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో మొదట పాకిస్థాన్ బ్యాటింగ్.. పవర్ ప్లే ముగిసేసరికి పర్వాలేదనిపించిన పాక్.. తొలి 10 ఓవర్లు ముగిసేసరికి పాక్ దే ఆధిపత్యం.. వికెట్ నష్టానికి 113 పరుగులతో భారీ స్కోర్ దిశగా అడుగులు.. 12 ఓవర్ల వరకు ఇది పాకిస్థాన్ పరిస్థితి. ఫైనల్లో టీమిండియాకు భారీ స్కోర్ సెట్ చేసి షాక్ ఇస్తుందనే అనుమానాలు పాక్ నెలకొల్పింది. టీమిండియాను ఒత్తిడిలో నెట్టడం ఖాయం అనుకున్నారు.
వికెట్ నష్టానికి 113 పరుగులతో పటిష్ట స్థితిలో కనిపించిన పాకిస్థాన్ కు టీమిండియా ఊహించని షాక్ లు ఇస్తూ వచ్చింది. పాక్ బ్యాటర్లను క్రీజ్ లో కుదురుకోనీయకుండా స్పిన్ తో కట్టి పడేసింది. 113 పరుగుల వద్ద అయూబ్ (14)ని కుల్దీప్ యాదవ్ ఔట్ చేస్తే.. 14 ఓవర్లో అక్షర్ పటేల్ మహమ్మద్ హారీస్ (0)ను పెవిలియన్ కు పంపించాడు. 15 ఓవర్లో 46 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న ఫకర్ జమాన్ (46) ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేయడంతో పాక్ పతనం మొదలైంది. ఇదే ఊపులో అక్షర్ పటేల్ తలాత్ (1) ను వెనక్కి పంపాడు. 17 ఓవర్లో కుల్దీప్ యాదవ్ విశ్వ రూపం చూపించాడు. ఈ ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు తీసుకొని పాక్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.
17 ఓవర్ తొలి బంతిని కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (8).. నాలుగో బంతికి షహీన్ అఫ్రిది (0).. చివరి బంతికి ఫహీమ్ అష్రాఫ్ (0) ను ఔట్ చేశాడు. చివర్లో బుమ్రా టైలండర్ల భరతం పట్టి పాక్ కథను ముగించాడు. ఒక దశలో వికెట్ నష్టానికి 113 పరుగులతో ఉన్న పాకిస్థాన్ అనూహ్యంగా 146 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫఖర్ జమాన్ (46) తప్ప మిగిలిన వారందరూ విఫలం కావడంతో పాకిస్థాన్ నిర్ణీత 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. సాహిబ్జాదా ఫర్హాన్ 57 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు.