నీళ్లు పాక్కు పోకుండా డ్యామ్స్ మూసేస్తున్న భారత్.. పాక్కు ఎంత నష్టం జరగొచ్చో చెప్పిన IRSA

నీళ్లు పాక్కు పోకుండా డ్యామ్స్ మూసేస్తున్న భారత్.. పాక్కు ఎంత నష్టం జరగొచ్చో చెప్పిన IRSA

సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడం వల్ల పాకిస్తాన్కు సాగు నీటి కష్టాలు తప్పేలా లేవని ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ(IRSA) తెలిపింది. పాక్తో జరిగిన ఈ ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడం వల్ల ఖరీఫ్ సీజన్లో పాకిస్తాన్కు సాగు నీటి కొరత ఏర్పడుతుందని IRSA పేర్కొంది. ఇప్పటికే చినాబ్​నదిపై ఉన్న బాగ్‌‌‌‌లిహార్‌‌‌ డ్యామ్‌‌‌‌ నీటిని ఆపేయగా.. తాజాగా ఇదే నదిపై ఉన్న సలాల్‌‌డ్యామ్‌ను కూడా మూసివేసింది.

ఇలా భారత్ సింధు నదీ జలాలను కట్టడి చేస్తుండటం వల్ల ఈ ఖరీఫ్ సీజన్లో పాకిస్తాన్కు 21 శాతం సాగు నీటి కొరతకు కారణమవుతుందని IRSA వివరించింది. పాకిస్తాన్లోని వ్యవసాయ భూముల్లో 80% (పంజాబ్, సింధు ప్రావిన్స్ లోనే ఉన్నాయి) భూములకు సింధు జలాలే కీలకం. ఈ రెండు ప్రావిన్స్లలో వ్యవసాయ రంగానికి సింధు నదీ జలాల నుంచే 93% సాగునీళ్లు అందుతున్నాయి. పాక్ గ్రామీణ జనాభాలో దాదాపు 61% మంది (23.7 కోట్ల మంది) ఇండస్ బేసిన్లోనే నివసిస్తున్నారు.

కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన నగరాలకు సింధు నదీ వ్యవస్థ నుంచే తాగునీరు సరఫరా అవుతోంది. అంతేకాకుండా తర్బెలా, మంగ్లా వంటి హైడ్రో పవర్ ప్లాంట్లు కూడా పాక్కు కరెంట్ సప్లైలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇండస్ బేసిన్లో పండే గోధుమలు, వడ్లు, చెరకు, పత్తి వంటి పంటల ద్వారా ఇండస్ బేసిన్ ప్రాతం నుంచే పాకిస్తాన్ జీడీపీకి 25% వాటా సమకూరుతోంది. అందుకే ఇండస్, ఝీలం, చీనాబ్ నదుల నుంచి నీటి ప్రవాహాలు తగ్గిపోతే పాక్లోని ఇండస్ బేసిన్ అంతా తీవ్రమైన నీటి కరువు ఏర్పడుతుంది. వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. కోట్లాది మందికి ఆహార భద్రత కరువవుతుంది.