కార్ కొనడం అనేది మిడిల్ క్లాస్ జనం అందరికి డ్రీం. స్తోమతను బట్టి ఎవరికి తగ్గ రేంజ్ మోడల్స్ వాళ్ళు కొంటుంటారు. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉండతంతో లక్షలు పోసి కార్లు కొనడానికి వెనకాడట్లేదు మిడిల్ క్లాస్ జనం. మధ్యతరగతి జనం సంగతి ఇలా ఉంటే... ధనవంతుల కథ వేరేలా ఉంటుంది. కోట్లు పెట్టి కార్లు కొనడమే కాకుండా వాటికి ఫ్యాన్సీ నంబర్ల కోసం లక్షలు తగలేస్తుంటారు చాలామంది. లక్షల్లో పలికిన కార్ నంబర్ల గురించి తరచూ వార్తలు వింటూనే ఉంటాం. ఏకంగా రూ. కోటి 17 లక్షలు పలికిన కార్ నంబర్ గురించి తెలుసా...?హర్యానాకు చెందిన ఒక VIP తన కార్ నంబర్ HR 88B 8888 కోసం ఏకంగా రూ. కోటి 17 లక్షలు ఖర్చు చేశాడు. బుధవారం ( నవంబర్ 26 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
హర్యానాలో జరిగిన ఆన్ లైన్ వేలంపాటలో ఒక VIP కార్ నంబర్ కోసం రూ. కోటి 17 లక్షలు వెచ్చించి కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. హర్యానా గవర్నమెంట్ అధికారిక పోర్టల్ fancy.parivahan.gov.in లో ఇవాళ సాయంత్రం జరిగిన బిడ్డింగ్ లో HR88B8888 నంబర్ రికార్డ్ ధర పలికింది. ఇది ఇండియాలోనే అత్యంత ఖరీదైన నంబర్ గా నిలిచింది. ఆన్ లైన్ లో జరిగిన ఈ వేలంపాటలో 45 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఈ నంబర్ బేస్ ధర రూ. 50 వేలు కాగా.. వేలంపాటలో క్రమక్రమంగా పెరుగుతూ రూ. కోటి 17 లక్షల రికార్డ్ ధరకు చేరింది. మధ్యాహ్నం నాటికి రూ. 88 లక్షలకు చేరిన నంబర్ ధర సాయంత్రం అయ్యేసరికి రికార్డ్ ధరకు చేరడంతో అంతా అవాక్కయ్యారు. ఇంతకీ కార్ నంబర్ కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేసిన ఆ వీఐపీ ఎవరు, ఆ కార్ ఏంటి అన్న వివరాలు తెలియాలి.
