- సీడీఎఫ్ నిధుల నుంచి నజరానాలు ప్రకటిస్తున్న నేతలు
- ఒక్కో ఊరుకు రూ. 10 లక్షల చొప్పున ఇస్తామన్న కేంద్ర మంత్రి బండి
- ఖమ్మం సెగ్మెంట్ లోనూ ఏకగ్రీవాలకు నజరానా ప్రకటించిన తుమ్మల
- క్యాండిడేట్ల ఖరారు నుంచి ఏకగ్రీవాల దాకా నేతల ప్రత్యేక శ్రద్ధ
హైదరాబాద్: తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో రేపటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు గ్రామాల బాట పట్టారు. రిజర్వేషన్ ఆధారంగా పార్టీ క్యాండిడేట్లను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. మెజార్టీ గ్రామాల్లో ఏకగ్రీవం చేసేందుకు చర్యలు ప్రారంభించారు.
కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నకుంటే తన నియోజకవర్గ నిధుల నుంచి ఆ గ్రామాలకు రూ. పది లక్షల చొప్పున నజరానా ఇస్తానని ప్రకటించారు. అదే విధంగా ఖమ్మం నుంచి ప్రాతి నిధ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తన సెగ్మెంట్ పరిధిలో ఏకగ్రీవంగా సర్పంచును, వార్డు సభ్యులను ఎన్నుకున్న గ్రామాలకు రూ. 10 లక్షల చొప్పున బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
పల్లెలపైనే పార్టీ నజర్
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు అన్ని పార్టీలూ ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీలో పాగా వేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రేపటి నుంచి తొలివిడుత నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో గ్రామాల వారీగా ఆశావహుల పేర్లను, ఏకగ్రీవానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. పోటీలో నిలవబోయే వ్యక్తులను దారికి తెచ్చే పనిలో కూడా నిమగ్నమయ్యారు.
గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులిస్తామని చెబుతున్నారు. తొలిదశ ఎన్నికలు జరిగే పంచాయతీల్లో ఈ నెల 27 నుంచి , సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరిగే పంచాయతీల్లో ఈ నెల 30 నుంచి, మూడో దఫా ఎన్నికలు జరిగే పంచాయతీల్లో వచ్చే నెల 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ మూడు దశల్లో కలిపి ఎన్ని గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది.
