సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయనంలోకి ప్రవేశించడం వల్లనే సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నామనేది మనకు సంప్రదాయంగా వస్తున్న ఆచారం. అయితే అలా కాకుండా ఈ పండుగకు మరో విశిష్టత కూడా ఉందని.. దానిని తెలియజేసేందుకే సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నామని కొంతమంది పండితులు అంటున్నారు. కాలం.. ఆయనం ప్రకారం జరుపుకొనే సంక్రాంతి పండుగ మోక్షానికి మార్గమని చెబుతున్నారు.
ఉత్తరాయనం కేవలం పుణ్యకాలాన్ని మాత్రమే సూచించేదికాదని.. జీవంతో ఉండిన వారు ఊర్ధ్వగతిలో చేరేందుకు దేవలోకాన్ని గుర్తు చేస్తుంది. మానవులు కేవలం దక్షిణాయనం నుండి ఉత్తరాయనంలోకి వెళ్లడం వల్ల జీవన్ముక్తులు కారు. కాలమే పుణ్యలోకాలను చేర్చాలని భావిస్తే , పాపాత్ములు కూడా మోక్షానికి అర్హులవుతారు. కాలానికి విముక్తులను చేసే శక్తిలేదు. పాపాల నుండి విముక్తులు చేసి పుణ్య లోకాలను ప్రసాదించగలిగిన శక్తి కేవలం పరమాత్మకు మాత్రమే ఉంది.
ALSO READ : 18న ఆదివారం మౌని అమావాస్య..
మహాభారతంలో భీష్ముడు అంపశయ్య మీద పడుకొని, ఉత్తరాయన పుణ్యకాలం వచ్చిందాకా ఉన్నాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. అంటే దీనిని బట్టి దక్షిణాయనంలో లేనిది ఏదో ఒక మహత్తర శక్తి ఉత్తరాయనంలో లభిస్తుందని తెలుస్తుంది. పాపాత్ములు దక్షిణాయనంలో కాక... ఉత్తరాయనంలో మరణిస్తే మళ్లీ జన్మలేకుండా చేసుకోవచ్చుననే అభిప్రాయం కలుగుతుంది. కాని కాలానికి పాపపుణ్యాలకు సంబంధంలేదు.
ALSO READ : సంక్రాంతి పండుగ రోజు( 2026 జనవరి 15) కొనాల్సిన వస్తువులు ఇవే..! ఎందుకంటే..!
మనం చేసిన కర్మలే పాపపుణ్యాలను నిర్ణయిస్తాయి. నిజానికి పాపాలనుండి విముక్తుల్ని చేసి సుఖాన్ని ప్రసాదించే వాడు పరమాత్మనే. కేవలం సుఖాన్ని మాత్రమే కాదు. మోక్షప్రదాత కూడా అతడే. కనుకనే దక్షిణాయనంలో మరణిస్తే దుర్గతి పొందుతారని...ఉత్తరాయణంలో మరణిస్తే సద్గతి పొందుతాడని చెప్పడం ఊహా మాత్రమేగాని .. సత్యం కాదు.
ALSO READ : సంక్రాంతి రోజు సూర్య భగవానుడి ఆరాధన ఎందుకు..?
ఉత్తరాయనంలో దేవలోక ద్వారం తెరిచి ఉంటుందని, దక్షిణాయనంలో అది మూసుకొని ఉంటుందని భావించడం కూడా వట్టి భ్రమ మాత్రమేనని కొంతమంది పండితులు చెబుతున్నారు.వేద ఋషులు సంవత్సరాన్ని రెండుగా విభజించి వాటికి దక్షిణాయనం, ఉత్తరాయణం అని పేర్లు పెట్టడంలో గొప్ప రహస్యం దాగి ఉన్నది. మనుష్య జీవనం భోగం (సుఖదుఖానుభవం)తో ముడిపడి ఉంది. పుణ్యకర్మలు చేస్తూ క్రమంగా నిష్కల కర్మలవైపు మానవుడు సాగిపోవడం ఒక దశ. ప్రకృతి పురుష వివేకం (జ్ఞానం) సంపాదించడం మరొక దశ. మనుష్య జీవితంలో కర్మకెంత ప్రాధాన్యం ఉందో జ్ఞానానికి అంతే ప్రాధాన్యం ఉంది... జ్ఞానాన్ముక్తిః.. అని సాంఖ్యదర్శనం చెప్తుంది.
అవిద్యయామృత్యుం తీర్త్వా...
విద్యయామృతమశ్నుతే అన్నారు మహానుభావులు
ఇది యజుర్వేద వచనం. నిష్కల కర్మ చేత మృత్యువును జయించి, జ్ఞానం (విద్య) చేత అమృతం (మోక్షం) పొందమని వేదం ఉపదేశిస్తున్నది. మనిషి కర్మలు చేయడం వల్ల అతనికి సుఖదుఃఖాలు లభిస్తాయి. ఈ సుఖదుఃఖాలనుభవించే స్థితికే భోగం అని పేరు. ఈ భోగ దశనే తాంత్రిక వేత్తలు భోగి అని పిలిచారు.
మనిషి భోగాలను అనుభవించే సమయమే ..దక్షిణాయనం... ఎప్పుడైతే కర్మ ఫలాలను ఆశించకుండా పుణ్య కర్మలు చేస్తూ... భోగాల నుంచి విముక్తి కలుగుతుందో అప్పుడే అతనికి ఊర్థ్వలోక ప్రాప్తి కలుగుతుంది. దీన్నే ...ఉత్తరాయణం ... అని వేదపండితులు గుర్తించారు.
దక్షిణాయనం ప్రవృత్తి రూపం. దానికే పితృయానమని పేరు. పితృయానమనగా, మళ్లీ జన్మ సంపాదించడమని అర్థం. భోగా ఎక్ష కలిగినవారు నిరంతరం దక్షిణాయనంలోనే సంచరిస్తారు. దీన్నే ..భోగి.. అనే పదం సూచిస్తుంది. ఇట్లే ఉత్తరాయనానికి దేవయానమని పేరు. ఇది నివృత్తి రూపం. భోగాపేక్షలేనివారు దేవయానంలో ప్రవేశించి మోక్షానందం పొందుతారు.
ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తూ సుఖదుఃఖాలనుభవిస్తూ భోగులుగా ఉండే జీవులు ఎల్లకాలం అలాగే ఉండవలసిన అవసరం లేదు. భవబంధనం అనేది శాశ్వతమైంది కాదు కనుక, జీవుడు ప్రకృతి పురుష వివేకం చేత జీవన్ముక్తుడై పరమాత్మలో ఉండి ఆనందాన్ని పొందగలడని పండితులు చెబుతున్నారు. .!
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
