బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ముంచుకొస్తున్న డిత్వా తుఫాను !

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ముంచుకొస్తున్న డిత్వా తుఫాను !

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు సెన్యార్ తుఫాను ముప్పు తప్పినప్పటికీ బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడటంతో మరో తుఫాను ముంచుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తుఫానుకు డిత్వా తుఫానుగా పేరు పెట్టారు. నవంబర్ 28 నుంచి 29 తేదీల మధ్య ఈ తుఫాను తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని.. ఈ కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రాలోని దక్షిణ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను ప్రభావంతో.. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకూ తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మత్స్యకారులను అధికార యంత్రాంగం సూచించింది. 45  నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేగంగా వీస్తాయని.. తీర ప్రాంత జనం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై డిత్వా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అతి వర్షాలు, అతి చలి, అతి వేడి లాంటి వైపరీత్యాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వాతావరణ పరిస్థితుల వల్ల మరణాలు కూడా అధికమవుతున్నాయి. 2022 నుంచి 2025 వరకు (జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో) తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ‘ఇండియా క్లైమేట్ 2025: యాన్ అసెస్మెంట్ ఆఫ్ ఎక్స్​ట్రీమ్ వెదర్ ఈవెంట్స్’ పేరిట ఈ మేరకు ఆ సంస్థ ఒక రిపోర్టును విడుదల చేసింది.

2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 273 రోజుల్లో 54 రోజుల పాటు తీవ్రమైన వాతావరణ పరిస్థితులున్నట్టు ఆ రిపోర్ట్ తేల్చింది. అందులో 26 రోజుల పాటు భారీ వర్షాలు, వరదలు సంభవించగా, 24 రోజులపాటు పిడుగులు పడ్డాయని.. ఈ పిడుగుల వల్లే 22 మంది చనిపోయారని వెల్లడించింది. యావరేజ్గా రెండు రోజులు హీట్​వేవ్స్, ఒక రోజు కోల్డ్​వేవ్ పరిస్థితులున్నట్టు తెలిపింది. అంటే ప్రతి ఐదు రోజులకొకసారి మన వాతావరణం తీవ్రంగా మారినట్టు రిపోర్టు స్పష్టం చేసింది.