Syed Mushtaq Ali Trophy 2025: CSK ప్లేయర్ ఊచకోత.. మినీ ఆక్షన్‌కు ముందు 31 బంతుల్లోనే సెంచరీ

Syed Mushtaq Ali Trophy 2025: CSK ప్లేయర్ ఊచకోత.. మినీ ఆక్షన్‌కు ముందు 31 బంతుల్లోనే సెంచరీ

ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాడు ఉర్విల్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ గుజరాత్ ఆటగాడు కేవలం 31 బంతుల్లో సెంచరీ కొట్టి సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు. హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో సర్వీసెస్‌తో జరిగిన ఈ మ్యాచ్ లో బౌండరీల వర్షం కురిపించి 37 బంతుల్లో 119 పరుగులు చేశాడు. ఉర్విల్ ఇన్నింగ్స్ లో 10 సిక్సర్లతో పాటు 12 ఫోర్లున్నాయి. గత సీజన్ లో ఉర్విల్ పటేల్ 28 బంతుల్లోనే సెంచరీ కొట్టి ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన భారత ప్లేయర్ గా నిలిచాడు. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యాన్ని గుజరాత్ అలవోకగా ఛేజ్ చేసింది. తొలి వికెట్ కు ఉర్విల్ పటేల్, ఆర్య దేశాయ్ ఏకంగా 174 పరుగులు జోడించి జట్టును ఈజీ విక్టరీ అందించారు. ఉర్విల్ పటేల్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 మధ్యలో ఈ గుజరాత్‌ వికెట్ కీపర్-బ్యాటర్ రూ.30 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు. వంశ్ బేడీ స్థానంలో ఉర్విల్ పటేల్ జట్టులోకి వచ్చాడు. గత సీజన్ లో సూపర్ కింగ్స్ తరపున మూడు మ్యాచ్ లాడిన ఉర్విల్.. మూడు ఇన్నింగ్స్ ల్లో 68 పరుగులు చేశాడు.

ALSO READ : చిత్తు చిత్తుగా ఓడారు

ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్న ఉర్విల్ పటేల్ కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. గుజరాత్‌కు చెందిన  వికెట్ కీపర్-బ్యాటర్ ఉర్విల్ పటేల్.. 2024 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 28 బంతుల్లోనే త్రిపురపై సెంచరీ కొట్టి ఇండియన్ క్రికెట్ చరిత్రలోకి ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. అంతే కాదు ఈ సెంచరీ గాలివాటం కాదని నిరూపిస్తూ ఆ తర్వాత జరిగిన మ్యాచ్ లో 36 బంతుల్లోనే సెంచరీ చేసి ఆశ్చర్యపరిచాడు. దీంతో ఉర్విల్ పటేల్ ను రూ. 30 లక్షలకు CSK తమ జట్టులోకి చేర్చుకుంది.