2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతన్నారు. ఫామ్ లో ఉన్న మన ఆటగాళ్లు సొంత గడ్డపై ఈ సారి కప్ కొట్టడం గ్యారంటీ అనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. అంచనాలకు తగ్గట్టుగానే ఫైనల్ కు వెళ్లిన రోహిత్ సేన ఆస్ట్రేలియా అడ్డంకిని అధిగమించలేకపోయింది. వరుసగా 10 మ్యాచ్ ల్లో గెలిచి రాయల్ గా ఫైనల్లో అడుగుపెట్టినా తుది సమరంలో ఆస్ట్రేలియా చేతిలో అనూహ్యంగా ఓడిపోయారు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్ పై గెలిచి ఆరోసారి ప్రపంచ ఛాంపియన్ గా అవతరిందింది.
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ రివెంజ్ తీర్చుకునే ఆలోచనలో ఉన్నాడు. మంగళవారం (నవంబర్ 25) టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్, వేదికలను ప్రకటించిన కార్యక్రమంలో సూర్యకుమార్ యాదవ్ కు "వరల్డ్ కప్ ఫైనల్ ఎవరితో ఆడాలనుకుంటున్నారు" అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సూర్య స్పందిస్తూ ఆస్ట్రేలియా ఫైనల్ కు రావాలి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఓడించాలి అని తన అభిప్రాయాన్ని తెలిపాడు. మరోవైపు రోహిత్ శర్మ గతం గతమే. ఖచ్చితంగా ఇండియా ఫైనల్స్ కు వచ్చి టైటిల్ గెలవాలని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్–2026 షెడ్యూల్‌ను మంగళవారం (నవంబర్ 25) రిలీజ్ చేసింది. ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఎప్పుడూ లేని విధంగా టోర్నీలో 20 జట్లు తొలిసారి తలపడుతున్నాయి. టోర్నీ ఇండియాలో జరగనుండడంతో భారీ హైప్ నెలకొంది. గ్రూప్–ఎలో ఇండియా, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. గ్రూప్–బిలో శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్ ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టు ఆడితే ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ కు రావొచ్చు. ఒకవేళ ఆస్ట్రేలియా ఫైనల్ కు వస్తే టీమిండియా రివెంజ్ తీర్చుకుంటుందో లేదో చూడాలి.
