ఇండియాలోనే 2030 కామన్వెల్త్ క్రీడలు.. ఆతిథ్య నగరంగా ఎంపికైన అహ్మదాబాద్

ఇండియాలోనే 2030 కామన్వెల్త్ క్రీడలు.. ఆతిథ్య నగరంగా ఎంపికైన అహ్మదాబాద్

అహ్మదాబాద్: 2030 కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ ఆతిథ్య నగరంగా ఎంపికైంది. మన దేశంలో చివరిసారిగా 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. 2030లో జరిగే  కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్‌‌ను ప్రతిపాదిస్తూ కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు చేసిన సిఫారసుకు ఆమోద ముద్ర పడింది. గ్లాస్గోలో జరిగిన జనరల్ అసెంబ్లీలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకున్నారు. అహ్మదాబాద్‌లో ఇటీవలే కామన్వెల్త్ వెయిట్‌ లిఫ్టింగ్ చాంపియన్‌ షిప్స్ సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే.

అహ్మదాబాద్ సిటీలో క్రీడా మౌలిక సదుపాయాలను భారీగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌ ‌‌క్లేవ్‌లో, వరల్డ్ లార్జెస్ట్‌‌ నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంతో పాటు, ఆక్వాటిక్స్ సెంటర్, ఫుట్‌ బాల్ స్టేడియం, ఇండోర్ స్పోర్ట్స్ కోసం రెండు అరీనాలు ఉన్నాయి. 2026లో గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌ను బడ్జెట్ పరిమితుల కారణంగా కేవలం 10 క్రీడలకు కుదించారు. రెజ్లింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్, హాకీ వంటి మెయిన్ స్పోర్ట్స్‌ను లిస్ట్‌ నుంచి తొలగించారు. అయితే, 2030లో అహ్మదాబాద్‌లో జరిగే  ఎడిషన్‌లో అన్ని ప్రధాన ఆటలు ఉంటాయని ఐఓఏ స్పష్టం చేసింది.

1930లో ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్‌కు 2030 నాటికి వందేళ్లు పూర్తవుతాయి. ఈ హిస్టారికల్‌ సెంచరీ ఎడిషన్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇండియా దక్కింది. ఇంతకుముందు 2010లో న్యూఢిల్లీలో తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్‌ను మన దేశం సక్సెస్‌‌ ‌ఫుల్‌గా నిర్వహించింది. 72 దేశాలు పోటీ పడే ఈ గేమ్స్ కోసం అప్పట్లో ఇండియా భారీగా ఖర్చు చేసింది. తొలుత గేమ్స్ బడ్జెట్‌ను రూ. 1600 కోట్లుగా అంచనా వేయగా.. చివరకు 70 వేల కోట్లు ఖర్చు చేశారు.