పాక్‌ జైలులో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను చంపేశారని ప్రచారం !

పాక్‌ జైలులో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను చంపేశారని ప్రచారం !

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్‌లోని రావల్పిండి అడియాలా జైలులో మాజీ ప్రధాని హత్యకు గురయ్యారనే వార్తతో ఆయన మద్దతుదారులు రోడ్లెక్కి ఆందోళనలకు దిగారు. రావల్పిండి సెంట్రల్ జైలు బయట ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, ఆయన మద్దతుదారులు భారీగా గుమిగూడారు. ఆయన గురించి వస్తున్న వార్తలపై జైలు అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ బలూచిస్తాన్ పేరుతో ఉన్న ‘ఎక్స్’ అకౌంట్లో కనిపించిన ఒక పోస్ట్ ఇమ్రాన్ ఖాన్ను హత్య చేశారనే ప్రచారానికి కారణమైంది. ఇమ్రాన్ ఖాన్‌ను.. ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ISI కలిసి హత్య చేశారనే సమాచారం ఉందని ఆ ‘ఎక్స్’ అకౌంట్లో పోస్ట్ చేశారు. అయితే.. ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారనే ప్రచారం ప్రస్తుతానికి పుకారు మాత్రమే. పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ తోషాఖానా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

పుకార్లు తీవ్రమవుతున్న క్రమంలో.. ఖాన్ సోదరీమణులు నోరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ మంగళవారం రాత్రి అడియాలా జైలుకు వెళ్లారు. ఖాన్ బతికే ఉన్నాడనేందుకు రుజువు కోరారు. శాంతియుతంగా గుమిగూడిన తమపై, పిటిఐ మద్దతుదారులపై పోలీసులు దాడి చేశారని వారు ఆరోపించారు. ఖాన్ పరిస్థితిని అధికారులు దాచిపెడుతున్నారని ఆరోపిస్తూ PTI కార్మికులు అర్ధరాత్రి భారీ ర్యాలీ చేశారు. మూడు వారాలకు పైగా ఆయన కుటుంబ సభ్యులెవరినీ కలవడానికి అనుమతించలేదని.. పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని పీటీఐ మద్దతుదారులు వాపోయారు.

2018 నాటి ఎన్నికల్లో పీటీఐ పార్టీ ఘన విజయం సాధించడంతో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 2022 ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి పదవిని కోల్పోయారు. రష్యా, చైనా, అఫ్గానిస్తాన్ విషయంలో స్వతంత్ర విదేశీ విధానాన్ని పాటించడం వల్లే అమెరికా ఆధ్వర్యంలో తన సర్కారును కూల్చేందుకు కుట్ర జరిగిందని ఇమ్రాన్ అప్పట్లో ఆరోపించారు. పదవి నుంచి దిగిపోయాక ఇప్పటివరకు ఇమ్రాన్పై దేశంలో 200 దాకా కేసులు నమోదయ్యాయి. అవినీతి, హింస, దైవదూషణ, హత్య, టెర్రరిజం వంటి ఆరోపణలతో ఈ కేసులు నమోదు కావడం గమనార్హం.